గోనెసంచిలో మృతదేహం

గోనెసంచిలో మృతదేహం - Sakshi


పరిగి: గోనెసంచిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన పరిగిలో బుధవారం తీవ్ర కలకలం రేపింది. దుండగులు హత్య చేసి మృతదేహాన్ని పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద యం ఎప్పటిలాగే పరిగి పంచాయతీ కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నారు.

 

పరిగి- హైదరాబాద్ రహదారిలో భవానీ థియేటర్ సమీపంలోని కల్వర్టు కింద చెత్తచెదారం ఎక్కువగా ఉండటంతో కార్మికులు వెళ్లారు. దుర్వాసన రావడంతో పరిశీలించగా ఓ తెల్లని గోనెసంచిలో గొర్రె  కళేబరం కనిపించింది. ఇంకొంచెం లోపలికి వెళ్లి చూడగా మరో గోనె సంచిలో సగభాగం లోపల, మిగతా భాగం బయట ఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది. కార్మికుల నుంచి విషయం తెలుసుకున్న పరిగి సర్పంచ్ విజయమాలసురేందర్  పోలీసులకు సమాచారం ఇచ్చింది.

 

పరిగి సీఐ ప్రసాద్, ఎస్‌ఐ షేక్ శంషొద్దీన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. మృతుడు చొక్కాపైన బనియన్, నలుపురంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. దాదాపు 35 ఏళ్ల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు. గుర్తుతెలియని దుండగులు దాదాపు నాలుగు రోజుల క్రితం అతడిని గొంతునులిమి చంపేసి ఇక్కడ పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

 

అయితే విషయం పక్కదారి పట్టించేందుకే మృతదేహం పక్కనే అదే తరహాలో  గోనెసంచిలో కట్టి గొర్రె కళేబరాన్ని పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. వ్యక్తి హత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే కేసును త్వరగా ఛేదించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఇటీవల దుండగులు మహబూబ్‌నగర్ జిల్లాలో హత్యలు చేసి రంగారెడ్డి జిల్లాలో మృతదేహాలు పడేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని చెప్పారు. స్థానికులు హతుడిని గుర్తించలేదు.

 

పోలీసు జాగిలాన్ని రప్పించినా మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఫలితం లేకుండా పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సందర్శించి సీఐ ప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top