సహజవాయువు ధరపై కమిటీ!

సహజవాయువు ధరపై కమిటీ! - Sakshi


న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తిఅయ్యే సహజవాయువు రేట్ల పెంపు అంశాన్ని సమీక్షించేందుకు మోడీ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ప్రత్యామ్నాయ ధరల విధానాన్ని సూచించాల్సిందిగా కోరుతూ మాజీ విద్యుత్ శాఖ మంత్రి సురేశ్ ప్రభు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయనుంది. కమిటీలో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రతాప్ భాను మెహతా, ఫ్యాకల్టీ సభ్యుడు బిబేక్ దేబ్‌రాయ్‌లు ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.



యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరను రెట్టింపు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకుండా మరోసారి వాయిదా వేసిన నెలరోజుల తర్వాత కమిటీ ఏర్పాటు నిర్ణయం వెలువడింది. ప్రస్తుతం ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ ధరను యూపీఏ ప్రభుత్వం రెట్టింపునకు పైగా(8.4 డాలర్లకు) పెంచుతూ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, అప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా దీన్ని వాయిదా వేశారు.



 ఎన్నికల తర్వాత కొలువుతీరిన ఏర్పాటైన మోడీ ప్రభుత్వం సహజవాయువు ధర పెంపు అమలుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా... విద్యుత్ చార్జీలు, యూరియా, సీఎన్‌జీ, పైపులద్వారా సరఫరా చేసే వంటగ్యాస్ ధరలు ఎగబాకుతాయన్న ఆందోళనల కారణంగా వెనక్కితగ్గింది. రేట్ల విధానాన్ని సమీక్షించే ఉద్దేశంతో సెప్టెంబర్ 30వరకూ యథాతథరేట్లను కొనసాగిస్తూ మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించింది.



 వచ్చే నెలాఖరు వరకూ గడువు...

 గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన ధరల విధానాన్ని సమీక్షించి ప్రత్యామ్నాయ ధరల విధానాన్ని సిఫార్సు చేయడానికి ఆగస్టు 31 వరకూ కమిటీకి గడువు ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ధరను రెట్టింపు చేయాలన్న రంగరాజన్ కమిటీ ఫార్ములాను ఇప్పుడున్నట్లుగానే ఉంచాలా.. దీనిలో ఏవైనా మార్పులు చేయాలా అనేది సూచించడంతోపాటు యూపీఏ ప్రభుత్వం 2014 జనవరి 10న జారీ చేసిన సహజవాయువు ధరల విధానం మార్గదర్శకాలను సమీక్షించడం కూడా కమిటీ చేయాల్సిన ప్రధాన విధులు.



 వివిధ దేశాల్లో అమలవుతున్న ప్రైసింగ్ విధానాలను కూడా కమిటీ పరిశీలించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కేజీ-డీ6 క్షేత్రాలకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్‌సీ)ల తరహా వాటివల్ల విద్యుత్, ఎరువుల రంగాలపై పడే ప్రభావం... దేశంలోని అన్వేషణ కార్యకలాపాలపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంపై కమిటీ దృష్టిపెడుతుంది. గ్యాస్ ధర పెంపుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఈ అంశానికి సంబంధించిన అన్ని పక్షాలతోనూ విస్తృతస్థాయిలో కమీటీ సంప్రతింపులు చేపట్టనుంది.



 రంగరాజన్ ఫార్ములా ప్రకారం ప్రస్తుత త్రైమాసికంలో దేశీ సహజవాయువు రేటు యూనిట్‌కు 8.8 డాలర్లుగా ఉండాలి. ప్రతి 3 నెలలకూ రేటును సవరించాలి. ఇదే జరిగితే విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ. 2 చొప్పున.. యూరియా ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.6,228.. సీఎన్‌జీ కేజీకి రూ.12 చొప్పున.. పైప్డ్ గ్యాస్ కేజీకి రూ.8.50 చొప్పున ఎగబాకుతాయని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top