సెన్సెక్స్‌ 318 పాయింట్లు డౌన్‌

సెన్సెక్స్‌ 318 పాయింట్లు డౌన్‌


ప్రతికూలంగా అంతర్జాతీయ సంకేతాలు

మూడు నెలల్లో ఒక్క రోజులోనే అధిక పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

91 పాయింట్ల నష్టంతో 9,030కు నిఫ్టీ   




అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో బాంబే స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాల్లో ముగిసింది. ఎన్‌ఎస్‌ ఈ నిఫ్టీ కీలకమైన 9,100 పాయింట్ల దిగువకు పడిపోయింది. స్టాక్‌ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 318 పాయింట్లు నష్టపోయి 29,168 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 9,030 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు నెలల కాలంలో సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు పతనం కావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ అధికంగా నష్టపోయింది కూడా ఈ రోజే. కన్సూమర్‌  డ్యూరబుల్స్, వాహన, ఎఫ్‌ఎంసీజీ, లోహ, బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.



పతనానికి కారణాలివీ...

ప్రస్తుత క్వార్టర్‌లో జీడీపీ 6.7 శాతానికి మందగిస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి.

ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష విఫలం కావడంతో భౌగోళిక ఉద్రిక్తతలు చెలరేగుతాయేమోనన్న ఆందోళనలు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ఆర్థిక విధానాల్లో అస్పష్టత పెరగడంతో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాల్లో ముగిసింది. ఈ ప్రభావంతో బుధవారం ఆసియా మార్కెట్లు రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

గత కొన్ని రోజులుగా బలపడుతూ వస్తోన్న రూపాయి పతనమయింది. ఇదే తీరు కొనసాగుతుందన్న సందేహాలూ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.

నగదు లావాదేవీ పరిమితిని రూ.2 లక్షలకు తగ్గించడం. ఈ ప్రతిపాదన కారణంగా ఆభరణాల సంబంధిత షేర్లు–టైటాన్, గీతాంజలి జెమ్స్, పీసీ జ్యూయలర్‌ షేర్లు 2–4 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి.



లోహ షేర్లకు నష్టాలు..

అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు తగ్గడంతో లోహ షేర్ల ధరలు పడిపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, హిందాల్కో, టాటా స్టీల్, జిందాల్‌ స్టీల్, వేదాంత షేర్లు 3 శాతం వరకూ నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 3.1 శాతం తగ్గి రూ.339 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. టాటా మోటార్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్‌ ఆటో షేర్లు 2 శాతం వరకూ నష్టపోయాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌బీఐ,  ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ షేర్లు కూడా క్షీణించాయి.  యాక్సిస్‌ బ్యాంక్‌ ఇంట్రాడేలో లాభపడినా... చివరిలో నష్టంలో ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top