భారత్‌లో 1.2 లక్షల కోట్ల చైనా పెట్టుబడులు

భారత్‌లో 1.2 లక్షల కోట్ల చైనా పెట్టుబడులు


ఇరు దేశాల మధ్య ఐదేళ్ల వాణిజ్య, ఆర్థిక సహకార ఒప్పందం

- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్,ప్రధాని మోదీ సమక్షంలో సంతకాలు

న్యూఢిల్లీ: చైనాతో ఐదేళ్ల వాణిజ్య, ఆర్థిక సహకార ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. తద్వారా వాణిజ్య సమతౌల్యాన్ని సాధించడంతోపాటు, 20 బిలియన్ డాలర్లమేర(రూ. 1.2 లక్షల కోట్లు) చైనా పెట్టుబడులను అందుకునేందుకు మార్గాన్ని వేసుకుంది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు ఐదేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పంద ప్రతులపై భారత వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, చైనా వాణిజ్య మంత్రి గావో హుచెంగ్ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య సమతౌల్యం, నిలకడతో కూడిన ఆర్థిక, వాణిజ్య విధానాలకు ఒప్పందం మార్గదర్శకంగా నిలవనుంది.



సమానత్వం, ఇరు దేశాలకూ లాభదాయకం అన్న అంశాల ప్రాతిపదికగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ అంశాల ఆధారంగా రానున్న ఐదేళ్లలో చైనా నుంచి భారత్‌కు 20 బిలియన్ డాలర్ల(రూ. 1.2 లక్షల కోట్లు) పెట్టుబడులు లభించేందుకు వీలు చిక్కనుంది. ఒప్పందంలో భాగంగా ఇన్వెస్టర్లకు అనుకూలమైన, పారదర్శకమైన, స్థిరమైన వాతావరణాన్ని ఇరు దేశాలూ కల్పించనున్నాయి. రెండు దేశాల వాణిజ్య మండళ్లు, ఆర్థిక రంగాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవలసి ఉంటుంది. గతేడాది రెండు దేశాల మధ్య 66.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైనప్పటికీ, చైనా 35 బిలియన్ డాలర్ల ఆధిక్యాన్ని సాధించడం గ మనార్హం.

 

మన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్...

ఒప్పందంలో భాగంగా చైనా రానున్న ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబడి ఉంటుంది. అంతేకాకుండా భారత వ్యవసాయోత్పత్తులు, జౌళి ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, హస్తకళలు, ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు తదితరాలకు చైనాలో మార్కెట్‌ను కల్పించనుంది. తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంలో ఇండియా ఎదుర్కొంటున్న భారీ లోటును తగ్గించేందుకు కృషి చేయనుంది. దిగుమతి సుంకాలను తగ్గించమంటూ ఇండియా ఎప్పటినుంచో చైనాను కోరుతూ వస్తున్న నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది.



ఒప్పందంపై సంతకాల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశీయంగా రెండు చైనీస్ పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుతోపాటు, 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఒప్పందం కుదరడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దీంతో తమ రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలలో కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం మహారాష్ట్రలో ఆటో పారిశ్రామిక పార్క్, గుజరాత్‌లో విద్యుత్ పరికరాల పారిశ్రామిక పార్క్‌ను చైనా ఏర్పాటు చేస్తుంది.

 

బ్యాంకింగ్ దిగ్గజాలతోనూ...

దేశీ బ్యాంకింగ్ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ), ఐసీఐసీఐ, యాక్సిస్‌లతో చైనా ఎగ్జిమ్ బ్యాంక్, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ కార్పొరేషన్(సీడీబీ) గురువారం వివిధ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. తద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సహకారమందించనున్నాయి. దీనిలో భాగంగా చైనా ఎగ్జిమ్ బ్యాంక్ అందించే లైన్ ఆఫ్ క్రెడిట్‌ను దేశీ సంస్థల దిగుమతులకు బ్యాంకింగ్ దిగ్గజాలు వినియోగించనున్నాయి. దేశీ కంపెనీలు చైనా నుంచి ఇంధనం, పరికరాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర వస్తువులను దిగుమతి చేసుకునేందుకు లైన్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top