పండుగ తర్వాత పసిడి పైపైకి!

పండుగ తర్వాత పసిడి పైపైకి! - Sakshi


పుత్తడి దిగుమతులపై మళ్లీ ఆంక్షలు...?

దీపావళి తర్వాత పరిశీలిస్తామన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ


 

న్యూఢిల్లీ: దీపావళి తర్వాత పసిడి ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుత్తడి దిగుమతులతో కరెంటు ఖాతా లోటు పెరిగిపోతున్న నేపథ్యంలో దీపావళి తర్వాత పసిడి దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే, ఇవి ఏవిధంగా ఉండవచ్చన్నది చెప్పకుండా ఆయన దాటవేశారు. పసిడి దిగుమతులపై ఆంక్షలు మళ్లీ విధిస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘పండుగ సీజన్ అయిపోనివ్వండి. తర్వాత చూడాల్సి ఉంటుంది’ అని జైట్లీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.



గతేడాది సెప్టెంబర్‌లో 682.5 మిలియన్ డాలర్లుగా ఉన్న పుత్తడి దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏకంగా 3.75 బిలియన్ డాలర్లకు ఎగిసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2012-13లో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) రికార్డు స్థాయిలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతానికి ఎగియడంతో అప్పట్లో పసిడి దిగుమతులపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కస్టమ్స్ సుంకాన్ని 10 % పెంచడం, బంగారు నాణేలు మొదలైన వాటి దిగుమతిపై నిషేధం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి.



మరోవైపు, పసిడి దిగుమతుల మీద ఆంక్షల విధింపు అంశం గురించి చర్చించేందుకు దీపావళి తర్వాత ఆర్‌బీఐ అధికారులు, బులియన్ పరిశ్రమ వర్గాలతో వాణిజ్య శాఖ సమావేశం కానున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశీ బులియన్ సంస్థల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రీమియం, స్టార్ ట్రేడింగ్ కంపెనీలు పసిడి దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించే అంశాన్ని సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

 

బడ్జెట్ కసరత్తులో ప్రభుత్వం..

ప్రస్తుతం ఆర్థిక శాఖ బడ్జెట్ తయారీలో నిమగ్నమైందని జైట్లీ చెప్పారు. క్రితంసారి తమకు కేవలం 40 రోజులు మాత్రమే లభించగా.. ఈసారి దాదాపు 5 నెలల సమయం లభించిందని చెప్పారు. రాబోయే మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మెరుగుపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక, ఆటోమొబైల్ రంగానికి ఇచ్చిన రాయితీల గడువు డిసెంబర్‌తో ముగిసిపోనున్న  నేపథ్యంలో వీటిని పొడిగించే అంశంపై స్పందిస్తూ ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని జైట్లీ చెప్పారు.



పెంచిన గ్యాస్ ధరలతో కంపెనీలు లాభాలు మాత్రమే గడించేందుకు ఆస్కారం ఉంటుందే తప్ప అనూహ్య లాభాలు పొందే వీలు ఉండదన్నారు. చమురు, గ్యాస్ కంపెనీలు.. అటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా హేతుబద్ధమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. యూనిట్‌కు (ఎంబీటీయూ) 5.61 డాలర్ల రేటుతో సైతం కంపెనీలకు లాభాలు ఉండగలవన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top