కేంద్రం ‘స్పాట్’!

కేంద్రం ‘స్పాట్’!


రూ. 5,600 కోట్ల చెల్లింపుల స్కామ్‌పై..



* ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్ విలీనం



* కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశం...   

* ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోసమేనని వెల్లడి

* ఎన్‌ఎస్‌ఈఎల్ చెల్లింపులు, అప్పులనూ ఎఫ్‌టీఐఎల్ భరించాల్సిందేనని స్పష్టీకరణ


 

న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్) రూ. 5,600 కోట్ల చెల్లింపుల కుంభకోణంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. జిగ్నేశ్ షా నేతృత్వంలోని మాతృసంస్థ ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీఐఎల్) గ్రూప్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌ను విలీనం చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కామ్‌లో చిక్కుకొని నష్టపోయిన ఇన్వెస్టర్లు, బ్రోకర్ల సొమ్మును తిరిగి ఇప్పించడం, వాళ్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొం ది. కాగా, తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని.. దీనిపై తమ న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపడతామని ఎఫ్‌టీఐఎల్ పేర్కొంది.



ఇక బాధ్యతంతా ఎఫ్‌టీఐఎల్‌దే...

ఎన్‌ఎస్‌ఈఎల్ బకాయి పడిన చెలింపులతో పాటు ఆ కంపెనీ రుణాలన్నింటికీ ఎఫ్‌టీఐఎల్ బాధ్యత వహించాల్సిందేనని ఆదేశాల్లో కేంద్రం తేల్చిచెప్పింది. ఎస్‌ఎస్‌ఈఎల్ మొత్తం వ్యాపారం, ఆస్తులు ఇతరత్రా అన్నీకూడా ఎఫ్‌టీఐఎల్‌కు బదిలీఅవుతాయి. ప్రజా ప్రయోజనాల రీత్యాప్రైవేటు రంగ కంపెనీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న కంపెనీల చట్టంలోని సెక్షన్ 396(నిబంధన-క్లాజ్)ను ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ప్రయోగించింది. ఈ క్లాజ్‌ను చాలా అరుదుగా మాత్రమే ప్రభుత్వాలు ఉపయోగిస్తుంటాయి. కాగా, 2009లో సత్యం కంప్యూటర్స్ ఖాతాల కుంభకోణం తర్వాత మళ్లీ ఒక ప్రైవేటు కంపెనీ వ్యవహరాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం దాదాపు ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. అయితే, సత్యం కేసు లో ఆ కంపెనీని థర్డ్‌పార్టీ(టెక్ మహీంద్రా)కి వేలం ద్వారా విక్రయిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.



అన్నీ పరిశీలించాకే...

ఏడాది కాలంగా పెండింగ్‌లోఉన్న బకాయిల రికవరీ, చెల్లింపుల విషయంలో ఎన్‌ఎస్‌ఈఎల్ చేతులెత్తేసిందని.. దీంతో తగిన వనరులున్న ఎఫ్‌టీఐఎల్‌లో విలీనం చేయడంద్వారా చెల్లింపులను వేగంగా రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 2013 నాటికి ఎన్‌ఎస్‌ఈఎల్ నెట్‌వర్త్ రూ.175.76 కోట్లుగా అంచనా. విలీనానికి సంబంధించి విధివిధానాలన్నీ పాటిస్తామని..  ఇరు కంపెనీల వాటాదారులు, రుణదాతలు తమ అభ్యంతరాలు/సూచనలను 60 రోజుల్లోగా వెల్లడించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. ముఖ్యంగా కంపెనీల చట్టం-1956లోని పలు నిబంధనలను ఇరు కంపెనీలూ ఉల్లంఘించినట్లు తమ దర్యాప్తులో తేలిందని.. అంతేకాకుండా ఎఫ్‌టైఎల్, దాని కీలక యాజమాన్య వ్యక్తుల నియంత్రణలో ఎన్‌ఎస్‌ఈఎల్ నడిచిందన్న విషయం కూడా వెలుగుచూసినట్లు కార్పొరేట్ వ్యవహరాల శాఖ ముసాయిదా ఆదేశాల్లో తెలిపింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఏవైనా కేసులు నమోదుకావాలన్నా, లేదంటే ఎలాంటి చట్టపరమైన చర్యలైనా ఎఫ్‌టీఐఎల్‌పైనే ఫైల్ చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.



ఇన్వెస్టర్ల ఆనందం...

ఇదిలాఉండగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్‌ఎస్‌ఈఎల్ ఇన్వెస్టర్ల ఫోరం(ఎన్‌ఐఎఫ్) స్వాగతించింది. చెల్లిం పులు నిలిచిపోయిన 13,000 మంది ఇన్వెస్టర్లు కలసి ఈ ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఎన్‌ఐఎఫ్ చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



షేరు క్రాష్: ప్రభుత్వ విలీన ఆదేశాల వార్తలతో ఎఫ్‌టీఐఎల్ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో 20 శాతం కుప్పకూలి లోయర్ సర్కూట్‌ను తాకింది. రూ.169.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.200 కోట్ల మేర ఆవిరైంది. రూ.781.72 కోట్లకు దిగజారింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top