సెల్‌కాన్ ‘మేడ్ ఇన్ తెలంగాణ’ తొలి ట్యాబ్లెట్

సెల్‌కాన్ ‘మేడ్ ఇన్ తెలంగాణ’ తొలి ట్యాబ్లెట్


 ఇంటెల్ ప్రాసెసర్‌తో రూపకల్పన

 40 దేశాలకు ఎగుమతి చేస్తాం

 సెల్‌కాన్ సీఎండీ వై.గురు


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ సీటీ722 పేరుతో ఇంటెల్ ప్రాసెసర్‌తో కూడిన ట్యాబ్లెట్ పీసీని రూపొందించింది. తెలంగాణలో తయారైన తొలి ట్యాబ్లెట్ ఇదే. డబ్ల్యూఎస్‌వీజీఏ డిస్‌ప్లేతో 7 అంగుళాల స్క్రీన్ , 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, లాలీపాప్ 5.1.1 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీని దీనికి పొందుపరిచారు. 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, ఓటీజీ, 3.2 ఎంపీ కెమెరా, ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ ఇతర ఫీచర్లు. ధర రూ.4,999. భారత్‌లో స్నాప్‌డీల్ ద్వారా ఇది లభిస్తుంది.

 

  హైదరాబాద్ సమీపంలోని సెల్‌కాన్‌కు చెందిన మేడ్చల్ ప్లాంటులో సీటీ722 తయారైంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారమిక్కడ ఈ మోడల్‌ను ఆవిష్కరించారు. మొబైల్ హబ్ ఏర్పాటులో భాగంగా ఇతర కంపెనీలతోనూ చర్చిస్తున్నట్టు మంత్రి చెప్పారు.  

 

 అంచనాలను మించి..

 కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ మినహాయింపు కారణంగా ట్యాబ్లెట్‌ను 20 శాతం తక్కువ ధరకు విక్రయించేందుకు వీలైందని సెల్‌కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. ‘సీటీ722 కోసం ప్రపంచ దేశాల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. 40 దేశాలకు ఎగుమతి చేయనున్నాం. అందుబాటు ధరతోపాటు ఇంటెల్ ప్రాసెసర్‌తో రూపొందడంతో అంచనాలను మించి డిమాండ్ ఉంటుందని విశ్వసిస్తున్నాం’ అని అన్నారు. కంపెనీ తయారీ సామర్థ్యం జూన్ నాటికి నెలకు 10 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని చెప్పారు. టీవీల తయారీకై డిసెంబర్‌లో భాగస్వామ్య కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఈ నెలలోనే రూ.5-10 వేల శ్రేణిలో నాలుగు 4జీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలను ప్రవేశ పెడుతున్నట్టు సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని వెల్లడించారు. చైనాలోని షెంజెన్‌లో ఉన్న పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ ప్లాంటులో 30 మోడళ్లను తయారు చేస్తున్నామని, వీటిని 12 దేశాలకు ఎగుమతి చేశామని వివరించారు.

 

 స్నాప్‌డీల్‌లో కార్ల విక్రయం..

 ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ ప్రస్తుతం హీరో, మహీంద్రా, వెస్పా, సుజుకి కంపెనీల ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క హీరో బ్రాండ్ టూ వీలర్లు రోజుకు 2,000 దాకా యూనిట్లు అమ్ముతున్నట్టు స్నాప్‌డీల్ స్ట్రాటజిక్ అలియాన్సెస్ వైస్ ప్రెసిడెంట్ కరన్‌ఖ రా తెలిపారు. త్వరలో కార్లను కూడా వెబ్‌సైట్లో చేరుస్తామని వెల్లడించారు. ఇక మొత్తం అమ్మకాల్లో మొబైల్స్ వాటా 30-40 శాతముందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.39,000 కోట్లకుపైగా వ్యాపారాన్ని నమోదు చేస్తామని అంచనాగా చెప్పారు.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top