మాల్యా కేసులో 8 మంది అరెస్ట్‌

మాల్యా కేసులో 8 మంది అరెస్ట్‌ - Sakshi


ఐడీబీఐ మాజీ చైర్మన్‌ యోగేశ్‌ అగర్వాల్‌ కూడా

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి ఎనిమిది మందిని సీబీఐ సోమవారం అరెస్ట్‌ చేసింది. ఇందులో ఐడీబీఐ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ యోగేశ్‌ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ఐడీబీఐ బ్యాంకు మాజీ చైర్మన్‌ సహా ముగ్గురు మాజీ ఉద్యోగులను, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన నలుగురు మాజీ ఉద్యోగులను అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. సరైన తనఖాలు లేకుండా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి రూ. 950 కోట్ల రుణం ఇచ్చారని యోగేశ్‌ తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాల్యా నివాసం సహా బెంగళూరులోని యూబీ టవర్స్‌లోను, అగర్వాల్‌ తదితరుల నివాసాల్లోనూ సీబీఐ సోమవారం తనిఖీలు నిర్వహించిన అనంతరం అరెస్ట్‌లు జరిగాయి.


సీబీఐ బృందం తమ కంపెనీ కార్యాలయానికి వచ్చిందని ధృవీకరించిన యూబీ గ్రూప్‌.. విచారణలో పూర్తిగా సహకరిస్తున్నట్లు వివరించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కేసులో మాల్యా, ఆయన కంపెనీల నుంచి 11.5 శాతం వార్షిక వడ్డీతో సహా రూ. 6,203 కోట్ల మేర బకాయిలను రాబట్టుకునేందుకు ఎస్‌బీఐ సారథ్యంలోని కన్సార్షియంకు బెంగళూరు డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ జనవరి 19న ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీబీఐ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నష్టాలు, రుణభారంతో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూతబడటంతో మాల్యా దేశం విడిచి వెళ్లిపోయారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top