కెనరా బ్యాంక్ లాభం రూ.613 కోట్లు

కెనరా బ్యాంక్ లాభం రూ.613 కోట్లు


డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.10.5

న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.613 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ బ్యాంక్ నికర లాభం రూ.611 కోట్లుగా ఉందని బ్యాంక్ ఈడీ పి. ఎస్. రావత్ చెప్పారు. మొండి బకాయిలు పెరగడం వల్ల నికర లాభం ఫ్లాట్‌గా ఉందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.11,610 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.12,429 కోట్లకు పెరిగిందని,  స్థూల మొండి బకాయిలు 2.49 శాతం నుంచి 3.89 శాతానికి, నికర మొండి బకాయిలు 1.98 శాతం నుంచి 2.65 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు.

 

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి(2014-15) బ్యాంక్ నికర లాభం 11 శాతం పెరిగి రూ.2,703 కోట్లకు పెరిగిందని రావత్ వివరించారు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.2,438 కోట్లుగా ఉందని చెప్పారు. మొత్తం ఆదాయం కూడా రూ.43,480 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.48,300 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రోడ్లు, ఉక్కు, విద్యుత్, టెక్స్‌టైల్స్ వంటి భారీ పరిశ్రమ కంపెనీలకు రుణాలిచ్చామని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.10.5 డివిడెండ్‌ను ఇస్తామని వివరించారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కోషేర్‌ను రూ.398.95 ప్రీమియం ధరకు 1,39,38,134 షేర్లను ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ ప్రాతిపాదికన కేటాయించి రూ.569.99 కోట్లు సమీకరించామని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top