ప్రీలాంచ్ వద్దు బాబోయ్!

ప్రీలాంచ్ వద్దు బాబోయ్! - Sakshi


అనుమతులు రాకముందే అమ్మకాలు

నగరంలో ఇబ్బడిముబ్బడిగా ప్రీలాంచ్ ఆఫర్లు    

ముందస్తు చెల్లింపులతో కొనుగోలుదారులకు నష్టం

సాక్షి, హైదరాబాద్: తక్కువ ధర, అభివృద్ధి చెందే ప్రాంతం, రెండేళ్లలో గృహ ప్రవేశం..ఇవీ ప్రీలాంచ్ కొనుగోళ్లతో కలిగే లాభాలని బిల్డర్లు చెప్పే మాటలు. అయితే పలు నిర్మాణ సంస్థలు ఆరంభించే ప్రీలాంచ్ పథకాల్లో నష్టభయం ఎక్కువగా ఉంటుంది. ఎలాగంటారా? అనుమతులు ఆలస్యం కావొచ్చు. ఇంటికి సంబంధించిన ప్రణాళికలు మారొచ్చు. పరిస్థితులు మెరుగ్గా లేక ఏకంగా ప్రాజెక్టే రద్దు కావొచ్చు. ఇటీవల ముంబైకి చెందిన ఓ నిర్మాణ సంస్థ హఫీజ్‌పేటలో ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అయితే ఆ నిర్మాణానికి నిర్ణీత అనుమతులు రాకముందే ఏడాదిన్నర కాలం ముందు నుంచే ఫ్లాట్లను విక్రయిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుందని పలువురు ‘సాక్షి రియల్టీ’తో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా బ్యాంకు వడ్డీ కూడా భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. అందుకే ప్రీలాంచ్ పథకమంటే చాలు కొనుగోలుదారుల్లో భయం నెలకొంది. తక్కువ ధరకొస్తుంది కదా అని ముందస్తు ప్రణాళిక లేకుండా తొందరపడి కొన్నారో మొదటికే మోసం రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

ప్రీలాంచ్ అమ్మకాలు.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన పోకడ. కాకపోతే విదేశాల్లో ప్రతి అంశాన్ని పక్కాగా పాటించాకే ముందస్తు పథకాల్ని ప్రవేశపెడతారు. కానీ, మనదేశంలో బిల్డర్లు, డెవలపర్లు ఒక అడుగు ముందుకేసి ఫ్లాట్ల ధరను ముందే నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఆయా నివాస సముదాయానికి నిర్ణీత అనుమతులు రాకముందే అమ్ముతున్నారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు పక్కాగా ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని నిర్ధారించక ముందే ఏయే తరహా నిర్మాణాలు చేపట్టాలనే విషయంలో ఒక నిర్ణయానికి రాకముందే ముందస్తు పథకాలను ప్రకటిస్తున్నారు. ఈ దశలో ప్రధానంగా మధ్యవర్తులను, కార్పొరేట్ భాగస్వాములను, పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. దీనికి సంబంధించి మార్కెట్లో ఒక్క ప్రకటన కూడా విడుదల చేయకుండా కేవలం నోటి మాట ద్వారా విషయం ఇతరులకు తెలిసేలా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇటీవల పలుసంస్థలు ఈ పథకాల గురించి ప్రకటనలు కూడా విడుదల చేయడం గమనార్హం.

 

అనుమతులు రాకముందే..

ముందస్తు పథకం ద్వారా ప్రయోజనం ఏమిటంటే.. డెవలపర్లకు ముందే కొంత సొమ్ము చేతికి అందుతుంది. దీంతో తక్షణమే ఆయా ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. చిన్న నిర్మాణ సంస్థలే కాదు బడా సంస్థలు కూడా ప్రీలాంచ్ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందుకొస్తున్నాయి. ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ప్రీలాంచ్ ఆఫర్లతో వచ్చిన సొమ్మును అనుమతుల కోసమో లేదా నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో ఉపయోగించుకుంటున్నారు. ముందస్తు అమ్మకాల ద్వారా బిల్డర్లు, డెవలపర్లు 10-15 శాతం వరకూ ఇళ్లను విక్రయిస్తుంటారని అంచనా. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్టు తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు పథకాన్ని ప్రకటిస్తుంటారు.

 

కొందరు పెట్టుబడిదారులు ముందస్తు అమ్మకాలపై అధిక దృష్టిసారిస్తున్నారు. నచ్చిన సైజు, కోరుకున్న దిక్కు, పైగా తక్కువ ధర.. పేరున్న బిల్డర్ అయితే తిరుగులేదని భావిస్తున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా సొమ్ము చెల్లిస్తారు. పక్కన ఉన్నవారితో కూడా కొనిపిస్తారు. 15 శాతం తక్కువ ధర. నిర్మాణం పూర్తి కావడానికి మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. కాబట్టి ఈలోపు ధర పెరుగుతుంది. దీంతో చక్కటి లాభాల్ని అందుకోవచ్చనేది వీరి ఆలోచన. గత నాలుగేళ్లలో కనీసం యాభై శాతం కంటే ఎక్కువ ధర పెరిగిందని చెప్పొచ్చు.

 

నియంత్రణేది..

2013 జూన్‌లో స్థిరాస్తి నియంత్రణ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. అనుమతులు తీసుకోకుండా నిర్మాణ సంస్థలు ఫ్లాట్లను విక్రయించడానికి వీల్లేదు. భూములను కొనడానికి రుణాల్ని మంజూరు చేయడాన్ని ఆర్‌బీఐ నిషేధించింది. అంతెంతుకు చైనాలో ముందస్తు అమ్మకాల సంప్రదాయం లేదు. అక్కడి డెవలపర్లకు నిధుల సమస్య ఉండదు. ప్రభుత్వమే భూమిని సేకరించి, డెవలపర్లకు స్థలాన్ని విక్రయిస్తుంది. స్థల యాజమాన్య హక్కుల విషయంలో సమస్యలుండవు కాబట్టి రుణాలు విరివిగా లభిస్తాయి. ఇక్కడ డెవలపర్లే అన్నీ చేసుకోవాలి. న్యాయపరమైన అంశమైనా, నిర్మాణంలో ఆలస్యమైనా బాధ్యత బిల్డర్లదే. అలా కాకుండా నిర్మాణ సంస్థలకు సులువుగా నిధులు లభించేలా ప్రభుత్వం తోడ్పాటును అందించాలి. ముందస్తు అమ్మకాలకు అడ్డుకట్టవేయాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top