సులువుగా బంగారం కొనొచ్చు

సులువుగా బంగారం కొనొచ్చు


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో సులువుగా వెండి, బంగారం కొనే విధంగా రిద్ధిసిద్ధి బులియన్స్ లిమిటెడ్ పలు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం బులియన్ ఇండియా పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసి, నెలనెలా కొంత మొత్తం కొనే విధంగా సిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పాటు త్వరలో మరో మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఫిన్‌కర్వ్ బులియన్ ఇండియా డెరైక్టర్ సచిన్ కొఠారి తెలిపారు.



 ప్రతీ నెలా కనీసం రూ.1,000 మొత్తంతో బంగారం లేదా వెండిని కొనే విధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని అందిస్తున్నామని, బ్యాంకులు, ఇతర ఆన్‌లైన్ బంగారంతో పోలిస్తే 5-8 శాతం తక్కువ ధరకే బంగారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం వివరాలు తెలియచేయడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొఠారి మాట్లాడుతూ ఎటువంటి అదనపు రుసుములు లేకుండా, పూర్తి రక్షణతో ఉచితంగా భద్రపర్చుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.



 ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని ఐడీబీఐ బ్యాంక్ ట్రస్టీకి చెందిన వాల్ట్‌లో భద్రపరుస్తామని, ఇన్వెస్టర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని కొని అమ్ముకోవచ్చన్నారు. ఒక గ్రాముకంటే ఎక్కువగా వున్నపుడు, వినియోగదారులు కోరుకుంటే ఫిజికల్ గోల్డ్‌ను ఇంటికి డెలివరీ చేస్తారు. దీంతో పాటు ప్రతీ నెలా స్థిరమైన పరిమాణంతో బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా గోల్డ్ ఎక్యూమలేట్ పథకాన్ని, అలాగే ప్రస్తుత ధరలో బంగారాన్ని కొని దాన్ని వాయిదా పద్థతుల్లో చెల్లించే విధంగా గోల్డ్ ఇన్‌స్టాల్‌మెంట్, అలాగే కొన్న బంగారాన్ని జ్యూవెలరీ సంస్థలకు బదలాయించి ఆభరణాలను కొనుగోలు చేసుకునే విధంగా గోల్డ్ యూనిట్ ట్రాన్సఫర్ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.



 స్నాప్‌డీల్ ద్వారా సత్యుగ్ గోల్డ్ ఆభరణాలు

 ప్రముఖ సినిమా నటి, శిల్పాశెట్టికు చెందిన సత్యుగ్ గోల్డ్ సంస్థ ఆభరణాలను స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు సత్యుగ్ గోల్డ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని స్నాప్‌డీల్ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top