ఫైన్డ్‌.. అన్ని బ్రాండ్లూ ఇక్కడే!

ఫైన్డ్‌.. అన్ని బ్రాండ్లూ ఇక్కడే! - Sakshi


అంతర్జాతీయ బ్రాండెడ్‌ దుస్తుల వేదిక

7,600 స్టోర్లలో 220 బ్రాండ్లతో డీల్‌

సౌదీ, ఆగ్నేయాసియా దేశాలకు విస్తరణ

రూ.20 కోట్ల నిధుల సమీకరణ పూర్తి

‘స్టార్టప్‌ డైరీ’తో ఫైన్డ్‌ కో–ఫౌండర్‌ హర్ష్ షా  




హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అలెన్‌ సోలీ, టామీ హిల్‌ఫిగర్, అమెరికన్‌ ఈగల్, పూమా, బీయింగ్‌ హ్యూమన్, లీ... ఇవన్నీ టాప్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటిని ఆన్‌లైన్‌లో కొనాలంటే కాస్త ఆలోచిస్తాం. కారణం.. ఆన్‌లైన్‌లో బ్రాండెడ్‌తో పాటూ స్థానిక దుస్తులూ ఉండటమే!! కానీ, బ్రాండెడ్‌ దుస్తులకు మాత్రమే వేదికగా నిలుస్తోంది ఫైన్డ్‌. ఒకటి కాదు రెండు కాదు దేశ, విదేశాల్లోని 220 బ్రాండ్ల దుస్తులు లభించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ హర్ష్ షా మాటల్లోనే..



బ్రాండెడ్‌ ఫ్యాషన్‌ ఉత్పత్తులను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకూ చేరువ చేయాలనే ఉద్దేశంతో గతేడాది జనవరిలో రూ.6 కోట్ల పెట్టుబడులతో ఫారూఖ్‌ ఆదాం, శ్రీరామన్‌ ఎంజీతో  కలసి ముంబై కేంద్రంగా ఫైన్డ్‌ (www.gofynd.com)ను ప్రారంభించాం. ప్రస్తుతం దేశంలోని 7,600 స్టోర్లలో 220 బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. 60 వేల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే మరో 140 బ్రాండ్లతో ఒప్పందం చేసుకుంటాం. ప్రస్తుతం మహిళలు, పురుషులకు సంబంధించిన దుస్తులు, పాదరక్షలు, జ్యుయలరీ, యాక్సెసరీలను మాత్రమే విక్రయిస్తున్నాం. మరో 2 నెలల్లో పిల్లల విభాగంలోకీ విస్తరిస్తాం. ఇటీవలే ఇన్‌–స్టోర్‌ సేవలను ప్రారంభించాం. ఇదేంటంటే.. ఒప్పందం చేసుకున్న స్టోర్లలోకి వచ్చిన కస్టమర్లకు వారికి నచ్చిన రంగులు, ఫ్యాషన్‌ ఉత్పత్తులు లేకపోతే వాటిని స్థానికంగా ఉన్న ఇన్‌–స్టోర్‌లో నమోదు చేస్తే చాలు. నేరుగా కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తాం.



రోజుకు 2,500–3,000 ఆర్డర్లు..

ప్రస్తుతం 32 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజూ 35–40 వేల మంది యాడ్‌ అవుతున్నారు. రోజుకు 2,500–3,000 ఆర్డర్లొస్తున్నాయి. కనీస ఆర్డర్‌ విలువ రూ.1,500. ప్రతి ఆర్డర్‌పై 20–30 శాతం విక్రయదారుడి నుంచి కమిషన్‌ తీసుకుంటాం. గతేడాది ఫైన్డ్‌ ద్వారా రూ.34 కోట్ల అమ్మకాలు జరిగాయి. కమిషన్‌ రూపంలో రూ.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ఐదు కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రెండు రోజుల్లో డెలివరీ చేస్తాం.



ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం..

ప్రస్తుతం 80 మంది ఉద్యోగులున్నారు.  ఈ ఏడాది ముగిసేలోగా 400 బ్రాండ్లకు, 60 లక్షల కస్టమర్లకు, రూ.90 కోట్ల జీఎంవీకి చేరుకోవాలని లక్ష్యించాం. మా మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 40–45%. అందులో ఏపీ, తెలంగాణ వాటా 15%. ఈ మధ్యే ఐఐఎఫ్‌ఎల్‌ సీడ్‌ వెంచర్స్, కేఏఈ క్యాపిటల్స్‌ నుంచి రూ.20 కోట్ల నిధులను సమీకరించాం. వీటిని విదేశీ విస్తరణకు ఉపయోగిస్తున్నాం. వచ్చే ఏడాది గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లో సేవలను ప్రారంభిస్తాం.



అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top