విశాల్‌ సిక్కాపై మూర్తి కౌంటర్‌ ఎటాక్‌

విశాల్‌ సిక్కాపై మూర్తి కౌంటర్‌ ఎటాక్‌

సాక్షి, న్యూఢిల్లీ : విశాల్‌ సిక్కా రాజీనామాతో, ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌కు, వ్యవస్థాపకులకు మధ్య వివాదం మరింత ముదిరింది. రాజీనామా చేస్తూ విశాల్‌ సిక్కా చేసిన ఆరోపణలపై కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. విశాల్‌ సిక్కా చేసిన నిరాధారణమైన ఆరోపణలపై స్పందిస్తే తన గౌరవానికే భంగకరమంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్ఫోసిస్‌ బోర్డు రాసిన ప్రకటనంతటిన్నీ చదివినట్టు తెలిపిన మూర్తి, ఆ ఆరోపణలు చాలా బాధాకరమని కూడా ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాక సరియైన సమయంలో తగిన సమాధానమిస్తానంటూ మూర్తి చెప్పారు. 2014లో తానే స్వయంగా బోర్డు నుంచి తప్పుకున్నానని, కనీసం నగదు కూడా కోరలేదని తెలిపారు. తన పిల్లల కోసం ఇన్ఫీలో కనీసం ఎలాంటి అధికారాలను, స్థానాలను అడుగలేదని కూడా మూర్తి చెప్పారు.

 

కాగ, కంపెనీ సీఈవో విధుల్లో తాను కొనసాగలేనని, నిరాధారమైన విషపూరిత వ్యక్తిగత దాడులను నిలువరిస్తూ తాను పనిచేయలేనని సిక్కా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ బ్లాగ్‌లో ఎవరి పేరును ఆయన పేర్కొనలేదు. కానీ నారాయణమూర్తి లాంటి హై ప్రొఫైల్‌ వ్యవస్థాపకులకు మధ్య తాను నలిగిన తీరును వివరించారు. గత కొంతకాలంగా కంపెనీ మేనేజ్‌మెంట్‌పై, సీఈవోగా ఉన్న విశాల్‌ సిక్కాపై వ్యవస్థాపకులు అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. అంతేకాక కంపెనీలో కార్పొరేట్‌ ప్రమాణాలు దెబ్బతింటున్నాయంటూ పలుమార్లు కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డుకి చురకలు పెట్టారు. చాలా విషయాల్లో వ్యవస్థాపకులకు, బోర్డుకు పొంతన కుదరడం లేదని పలుమార్లు బహిర్గతం కూడా అయింది. విశాల్‌ సిక్కాకు ఎక్కువగా పరిహారాలు చెల్లించడం, కంపెనీ నుంచి వైదొలిగిన కొందరు మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు అందించిన సెవరెన్స్‌ ప్యాకేజీ విషయంలోనూ వ్యవస్థాపకులు, బోర్డును ప్రశ్నించారు.  

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top