మీ ఇంటి కోసం అందమైన బడ్జెట్‌?

మీ ఇంటి కోసం అందమైన బడ్జెట్‌?


 ఆదాయ, వ్యయాలపై పూర్తి అవగాహన ఉండాలి  

 ఖర్చులకు కళ్లెం వేస్తేనే లక్ష్యాల సాకారం

 అవసరాల కోసం లక్ష్యాలను పణంగా పెట్టవద్దు  

 మీకంటూ బడ్జెట్‌ రూపకల్పనతో తగిన క్రమశిక్షణ




 ఎంత సంపాదించినా పొదుపు చేయలేకపోతున్నారా...?  అవును అనే సమాధానం వస్తే వెంటనే మీ ఇంటి బడ్జెట్‌ రూపకల్పనకు సిద్ధమై పోండి. బడ్జెట్‌ అన్నది వస్తున్న ఆదాయాన్ని అర్థవంతంగా, తెలివిగా వినియోగించేందుకు... వ్యయాలను నియంత్రించుకునేందుకు ఓ మార్గ సూచీలా తోడ్పడుతుంది. చక్కని బడ్జెట్‌ తయారు చేసుకోవడం వల్ల మీ డబ్బును ముందుగా ముఖ్యమైన వాటికి మళ్లించేందుకు వీలుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. అంతగా ప్రాధాన్యం లేని వాటిపై అధికంగా ఖర్చు చేయకుండా కూడా నియంత్రణతో ఉండవచ్చు. బడ్జెట్‌ అన్నది వస్తున్న ఆర్థిక వనరులను ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయించుకునేందుకు వీలు కల్పిస్తుంది.



 ఇప్పడంతా స్మార్ట్‌ యుగం కనుక ఈ పని చేసి పెట్టేందుకు బడ్జెటింగ్‌ యాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ యాప్‌లు మీ ఖర్చులను గమనిస్తూ గీత దాటిపోతుంటే అప్రమత్తం చేస్తాయి. రెస్టారెంట్‌కు వెళ్లి మంచి పార్టీ చేసుకున్నా, వస్త్రదుకాణాల్లో రెచ్చిపోయి షాపింగ్‌ చేసినా సరే ఓ సారి హెచ్చరిస్తాయి. నిజానికి యుక్త వయసులో ఉన్న వారు తమ సంపాదనలో ఎక్కువగా ఖర్చు పెట్టేది, విందులు, వినోదాలు, వస్త్రాలపైనే. చిన్న వయసులోనే పొదుపు ప్రారంభమైతే సంపద సృష్టి సాధ్యమవుతుంది.



30 ఏళ్ల వయసు నుంచే నెలకు కేవలం రూ.10వేలు పొదుపు చేసి దాన్ని వార్షికంగా 10 శాతం రాబడినిచ్చే సాధనాల్లో మదుపు చేశారనుకుందాం. 30 ఏళ్ల తర్వాత అంటే 60 ఏళ్ల వయసుకు వచ్చే సరికి 2.16 కోట్ల నిధి ఏర్పడుతుంది. అదే కొంచెం ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో నెలకు రూ.10వేల పొదుపు, మదుపులను ప్రారంభిస్తే ఈ నిధి కాస్తా రూ.96 లక్షలకే పరిమితం అవుతుంది. అందుకే వీలైనంత చిన్న వయసు నుంచే ఖర్చులకు కళ్లెం వేసుకుంటే వారి రిటైర్మెంట్‌ జీవితం హాయిగా సాగిపోతుంది. ఇందుకు బడ్జెట్‌ అక్కరకు వస్తుంది.  దీని గురించి చర్చించేదే ఈ వారం ప్రాఫిట్‌ కథనం...

–సాక్షి బిజినెస్‌ డెస్క్‌




బడ్జెట్‌తో ఉపయోగాలు...

ఆర్థిక లక్ష్యాల విషయంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. బడ్జెట్‌ ఈ క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. బడ్జెట్‌ మన ఖర్చులను ప్రాధాన్యతల వారీగా విభజిస్తుంది. వాటికి అవసరమైన మేర నిధులను కేటాయిస్తుంది. తమకంటూ ఓ బడ్జెట్‌ రాసుకుని దాని ప్రకారం నడిచే వారు, ఏ బడ్జెట్‌ లేకుండా సాగిపోయేవారితో పోలిస్తే మరింతగా పొదుపు చేయగలుగుతున్నట్టు ఎన్నో సర్వేల్లో వెల్లడైంది. బడ్జెట్‌ వల్ల ప్రతీ నెలా దేనికి ఎంత వినియోగించాలనే స్పష్టత ఉంటుంది. ఇది లేకపోతే అసలు కుటుంబ అవసరాలకు ఎంత కావాలి, పెట్టుబడులకు ఎంత కావాలన్న స్పృహ ఉండదు. దాంతో అనవసర ఖర్చులకు సంపాదనంతా తరిగిపోతుంది. ఫలితంగా అవసరాలప్పుడు చేయి చాచే పరిస్థితి ఎదురవుతుంది. దాహం వేసినప్పుడు బావి తవ్వుకోవడం మాదిరిగా బడ్జెట్‌ లేని వారి వ్యవహారం ఉంటుందని చెప్పుకోవచ్చు.    



బడ్జెట్‌ ఇలా

ముందుగా ఏ ఏ రూపాల్లో ఎంత ఆదాయం వస్తుందో నోట్‌ చేసుకోవాలి. వేతనం రూపంలో, ఇంటి అద్దెల రూపంలో, డిపాజిట్లపై వడ్డీ, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా వచ్చే డివిడెండ్‌ ఆదాయం ఇవన్నీ ఆదాయంలో భాగమే. తర్వాత ఖర్చులన్నింటినీ పేపర్‌పై పెట్టండి. ప్రాధాన్యతల వారీగా వాటికి నిధులను కేటాయించాలి. కిరాణా బిల్లు, ఇంటి పనులు చేసే వ్యక్తికి ఇచ్చే వేతనం, పెట్రోల్, ఏదైనా రుణం తీసుకుని ఉంటే దానికి నెలనెలా చెల్లించే వాయిదా(ఈఎంఐ), పిల్లలు ఉంటే వారి స్కూల్‌ ఫీజులు, బీమా ప్రీమియం ఇలా ముఖ్యమైన ప్రతీ ఖర్చునూ రాసుకోవాలి.



బడ్జెట్‌ సూత్రం

50:30:20 అనేది బడ్జెట్‌కు సంబంధించి ఎక్కువగా ఆచరించే ముఖ్య సూత్రం. వస్తున్న ఆదాయంలో 50 శాతం కనీస అవసరాలకు కేటాయించాలి. అంటే ఆహారం, నివాసం, వస్త్రాలు, వైద్యం ఇవన్నీ కనీస అవసరాల కిందకు వస్తాయి. ఇక 30 శాతం ఆదాయాన్ని మీ విచక్షణ మేరకు వినియోగించుకోవచ్చు. అంటే విందులు, వినోదాలకుమాట. మిగిలిన 20 శాతాన్ని తప్పకుండా పొదుపు చేయాల్సిందే. పొదుపు అంటే మిగల్చడం మాత్రమే కాదు, దాన్ని పెట్టుబడులకు మళ్లిస్తేనే వృద్ధి ఉంటుందని తెలుసుకోవాలి. అందరూ ఇదే సూత్రాన్ని పాటించాలనేమీ లేదు. ఎందుకంటే వారి వారి ప్రత్యేక అవసరాల రీత్యా 60:20:20 సూత్రాన్ని సైతం పాటించుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో సగటు మధ్య తరగతి ఇళ్ల బడ్జెట్‌ ఈ సూత్రం ఇదే మాదిరిగా ఉంటుంది.



ఉప పరిమితులు

పైన రెండు రకాల సూత్రాలు చెప్పుకున్నాం. కనీస అవసరాలకు 50 నుంచి 60 శాతం, విచక్షణావసరాలకు 20 నుంచి 30 శాతం, పొదుపునకు 20 శాతం కేటాయింపులను చూశాం. ఇప్పుడు ప్రతీ విభాగంలోనూ ఒక్కోదానికి ఉపపరిమితులు కూడా విధించుకోవాలి. ఉదాహరణకు కనీస అవసరాల్లో కిరాణాకు ఇంత మొత్తం, ఆహారం, వస్త్రాలకంటూ ఇంత బడ్జెట్‌ చొప్పున కేటాయింపులు చేసుకోవాలి. ఇక రుణాలకు చేసే చెల్లింపులు నెలసరి ఆదాయంలో గరిష్టంగా 50 శాతానికి మించకుండా చూసుకోవాలి. రుణ చెల్లింపులు 50 శాతం మించితే విశ్రాంత జీవితానికి కేటాయింపులు, పిల్లల భవి ష్యత్‌ విద్యావసరాల లక్ష్యాలకు కేటాయింపుల ను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత బీమా ప్రీమియం మొత్తం ఆదాయంలో 2 – 3 శాతానికి మించకుండా చూసుకోవాలి. ఉదాహరణకు రూ.5 లక్షల వార్షిక వేతనం ఉన్న వ్యక్తి వార్షికంగా రూ.10వేల నుంచి రూ.15వేల వరకు జీవిత బీమా కోసం కేటాయించుకోవచ్చు. ఇంత తక్కువతో సరైన బీమా కవరేజీనిచ్చేది టర్మ్‌ ప్లాన్లు మాత్రమే. అదే సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలో రూ.15 వేలు వెచ్చిస్తే రూ.3 లక్షలకు మించి బీమా కవరేజీ వచ్చే పరిస్థితి లేదు. పదేళ్ల తర్వాత పిల్లల ఉన్నత విద్యావసరాలకు ఇంత మొత్తం కావాలన్న లక్ష్యం, రిటైర్‌ అయిన తర్వాత కనీస జీవనానికి కావాల్సిన నిధి కోసం మంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను ఎంచుకుని వాటికి వేతన ఖాతా నుంచి నెల నెలా ఆటోమేటిక్‌గా పెట్టుబడులు వెళ్లేలా ఈసీఎస్‌ ఇవ్వాలి.



సర్దుబాట్లు

విభాగం వారీ బడ్జెట్‌ కేటాయింపుల తర్వాత కొన్ని విభాగాల్లో కొంత మిగులు ఉండవచ్చు. ఆ మిగులును అత్యవసర పరిస్థితుల కోసం వినియోగించుకోవచ్చు. అలాగే ఈ మిగులును పొదుపు విభాగంలోకీ మళ్లించుకోవచ్చు. అంతేకానీ విచక్షణావసరాలకు మాత్రం మళ్లించరాదు. అనవసర వ్యయాల వల్ల అవసరమైన లక్ష్యాలు దెబ్బతింటాయి.  



సమీక్ష

బడ్జెట్‌ రూపొందించుకుని దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత పరిశీలిస్తే... మీ ఖర్చులు, పొదుపులు స్పష్టంగా తెలిసిపోతాయి. దాంతో ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవచ్చన్నదీ తెలుస్తుంది. అలాగే పొదుపు మొత్తాన్ని బట్టి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సైతం రూపొందించుకోవడం సులువు అవుతుంది. మొత్తం మీద బడ్జెట్‌ అనేది మన కోసం మనం రూపొందించుకుని నడిచే ఆర్థిక బాట. క్రమశిక్షణతో నడిపిస్తూ ఆర్థిక పరమైన ఆటుపోట్లను రాకుండా చూసే దిక్సూచీ.



 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top