ఇనుప ఖనిజంపై దిగుమతి సుంకం తొలగించాలి

ఇనుప ఖనిజంపై దిగుమతి సుంకం తొలగించాలి


న్యూఢిల్లీ: ఇనుప ఖనిజం దిగుమతులపై సుంకాన్ని తొలగించే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు ఉక్కు శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశీయంగా సరఫరాలు తగ్గిపోవడంతో స్టీల్ కంపెనీలు విదేశాల నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో దిగుమతుల అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖకు రాతపూర్వకంగా తెలియజేసినట్లు వెల్లడించారు.



 ఇనుప ఖనిజంపై దిగుమతి సుంకాన్ని తొలగించాల్సిందిగా సూచించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇక ఆర్థిక శాఖ నిర్ణయాన్ని తీసుకోవలసి ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇనుప ఖనిజ దిగుమతులపై 2.5% సుంకాన్ని విధిస్తున్నారు. స్టీల్ కంపెనీలు ఇనుప ఖనిజాన్ని ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. దేశీయంగా ముడిసరుకు లభ్యత తగ్గడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ వంటి సంస్థలు ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకునే సన్నాహాల్లో ఉన్నట్లు స్టీల్ శాఖ అధికారి చెప్పారు.



 సీతారామన్‌కు మెమొరాండం: దేశీయంగా ఇనుప ఖనిజ లభ్యత తగ్గిపోవడంతో స్టీల్ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నదని వివరిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పరిశ్రమల సమాఖ్య అసోచామ్ నివేదిక ఇప్పటికే అందజేసింది. వెరసి ప్రస్తుతం విధిస్తున్న 2.5% సుంకాన్ని తొలగించాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దేశీయంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి గతేడాది 144 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి మరింత అధికంగా 90-95 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకాల తొలగింపునకు ప్రాధాన్యత ఏర్పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top