6 నెలల్లో ఏపీ కొత్త పారిశ్రామిక విధానం

అనిల్ స్వరూప్ - Sakshi


పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో లక్ష ఎకరాలు

త్వరితగతిన ప్రాజెక్టుల అనుమతి మంజూరుకై ఈ-పీఎంఎస్

ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్

త్వరలో పీఎంఎస్ పరిధిలోకి తెలంగాణ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పారిశ్రామిక విధాన రూపకల్పనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన పారిశ్రామిక విధానం మార్చి, 2015 వరకు అమల్లో ఉండటంతో దాని స్థానంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తయారు చేస్తున్నామని, దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాల వారిగా సలహాలు సూచనలు సేకరించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానం తయారీకి సంబంధించి సూచనలు తీసుకోవడానికి త్వరలోనే పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ లేదా మరో పట్టణంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.



వీటన్నింటినీ క్రోడీకరించి ఆరునెలల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఆన్‌లైన్‌లో పెట్టుబడులను ట్రాకింగ్ చేసే ఈ-పీఎంఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్ కలసిన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్ట విభజన సందర్భంగా ఇస్తామన్న ప్రత్యేకహోదాపై కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదన్నారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యంగా మూడు కారిడార్లపై దృష్టి సారిస్తున్నామన్నారు. విశాఖ-కాకినాడ పెట్రోకారిడార్, విశాఖ-చెన్నై, బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్లతో తయారీ రంగంలో అనేక ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

 

పెట్టుబడుల ట్రాకింగ్ కోసం.. ఈ-పీఎంఎస్

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ-పీఎంఎస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం రూ.100 కోట్లు దాటిన పెట్టుబడులు, వాటి అనుమతులను త్వరితగతిన జారీ చేయడం, ఆ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని తెలుసుకోవడానికి ఈ-పీఎంఎస్ దోహదం చేస్తుంది. ఆగిపోయిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం ప్రభుత్వం ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూపు(పీఎంజీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.



కేంద్రం రూ.1,000 కోట్లు దాటిన ప్రాజెక్టులను ఈ విధానంలో పర్యవేక్షిస్తుండగా, రాష్ట్రాలు రూ.100 కోట్లు దాటిన ప్రాజెక్టులను చూస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ-పీఎంఎస్‌ను కేంద్ర పీఎంజీ హెడ్ అనిల్ స్వరూప్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధానం కింద ఇప్పటి వరకు రూ.21 లక్షల కోట్ల విలువైన 445 ప్రాజెక్టులు నమోదు కాగా అందులో 150 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ఆగిపోయిన ప్రాజెక్టులు 20 వరకు ఉన్నాయన్నారు. పీఎంజీ గ్రూపులో 13వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేరిందని, త్వరలోనే తెలంగాణ రాష్ట్రం కూడా చేరుతోందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top