ఎయిర్టెల్ లాభం 31% డౌన్

ఎయిర్టెల్ లాభం 31% డౌన్


క్యూ1లో రూ.1,462 కోట్లు...

ఆదాయం రూ. 25,573 కోట్లు; 8 శాతం వృద్ధి




న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం దిగజారి రూ.1,462 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,113 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా భారీస్థాయిలో పెట్టుబడుల ప్రభావం లాభాల తగ్గుదలకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది.


అయితే, రూ.556 కోట్ల అసాధారణ రాబడి వచ్చిన నేపథ్యంలో  గతేడాది లాభాన్ని అంతర్జాతీయ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రమాణాల(ఐఎఫ్‌ఆర్‌ఎస్) నుంచి భారత్ అకౌంటింగ్ ప్రమాణాల(ఇండ్-ఏఎస్) మేరకు రూ.2,113 కోట్లుగా చూపాల్సి వచ్చిందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐఎఫ్‌ఆర్‌ఎస్ ప్రకారం గతేడాది(2015-16) క్యూ1లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,554 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం 7.9 శాతం వృద్ధితో రూ.23,681 కోట్ల నుంచి రూ.25,573కు చేరింది. అయితే, ఆఫ్రికా టెలికం యూనిట్, టవర్ ఆస్తుల విక్రయానికి అనుగుణంగా ఈ ఆదాయాన్ని సర్దుబాటు చేసినట్లు పేర్కొంది.


 మొబైల్ డేటా జోరు...

క్యూ1లో కంపెనీ మొత్తం మొబైల్ డేటా ఆదాయం 34.1 శాతం ఎగబాకి రూ.4,640 కోట్లకు దూసుకెళ్లింది. మొబైల్ సర్వీసుల్లో 9.1 శాతం వృద్ధి నేపథ్యంలో భారత్ కార్యకలాపాలకు సంబంధించి ఆదాయం జూన్ క్వార్టర్‌లో రూ.19,155 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. క్యూ1లో 10.3 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. ‘ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మంచి పనితీరును కనబరిచాం. కాల్‌డ్రాప్ సమస్య పరిష్కారంలో భాగంగా మా కస్టమర్లందరికీ కంపెనీ మొత్తం మొబైల్ నెట్‌వర్క్‌ను పారదర్శకంగా చూపించేలా ‘ప్రాజెక్ట్ లీప్’ను అమలు చేస్తున్నాం’ అని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ (భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ పేర్కొన్నారు.


 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...

ఇక భారత్ కార్యకలాపాలకు సంబంధించి క్యూ1లో లాభం 8.7% దిగజారి రూ. రూ.2,249 కోట్ల నుంచి రూ. 2,051 కోట్లకు తగ్గింది.


దక్షిణాసియా విభాగం నికర నష్టం(అసాధారణ అంశాలు కాకుండా) రూ.235 కోట్ల నుంచి రూ. 251 కోట్లకు పెరిగింది. అయితే, ఆఫ్రికా కార్యకలాపాల నికర నష్టం మాత్రం రూ.976 కోట్ల నుంచి రూ. 520 కోట్లకు దిగొచ్చింది.


క్యూ1లో కంపెనీ పెట్టుబడులు 23 శాతం ఎగసి రూ.4,925 కోట్లకు చేరాయి.


కన్సాలిడేటెడ్ నికర రుణ భారం జూన్ చివరికి 23.5% ఎగసి రూ. 83,492 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే నెలాఖరుకు రూ.67,746 కోట్లు.


గతేడాది క్యూ1తో పోలిస్తే మొబైల్ డేటా సేవల్లో ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం రూ.21 పెరిగి రూ.202కు చేరింది.


జూన్ ఆఖరికి భారత్‌లో మొబైల్ యూజర్ల సంఖ్య 25.5 కోట్లుగా ఎయిర్‌టెల్ తెలిపింది. కంపెనీ మొత్తం కార్యకలాపాలకు సంబంధించి కస్టమర్ల సంఖ్య 35.7 కోట్లకు పెరిగింది.


ఎయిర్‌టెల్ షేరు ధర బుధవారం బీఎస్‌ఈలో 0.8% లాభంతో రూ. 373 వద్ద ముగసింది. ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top