ఎయిర్ ఇండియా మరో బంపర్ ఆఫర్

ఎయిర్ ఇండియా మరో బంపర్ ఆఫర్


న్యూఢిల్లీ:  అకస్మాత్తుగా  దూరం ప్రయాణించాల్సి వచ్చిందా?  విమానంలో ప్రయాణించడానికి ...లాస్ట్ మినిట్లో బాదేసే ధరల గురించి  బెంగపడుతున్నారా?  అయితే మీలాంటి వారికోసమే ఎయిర్ ఇండియా మరో సరికొత్త ఆఫర్ ను  ప్రవేశపెట్టింది. రాజధాని ఎక్స్ ప్రెస్ టికెట్ ధరలకంటే తక్కువ ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తూ ప్రయాణీకులను ఆకట్టుకుంటోంది.  ఆక్యుపెన్సీ పెంచుకునే దిశలో ఎయిర్ ఇండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  ట్రంక్ రూట్స్ లో  మరింత మంది  ప్రయాణీకులను  ఆకర్షించే  దిశగా  చివరి నిమిషంలో తమ విమాన టికెట్ల ధరలను మరింత తగ్గిస్తోంది. ఈ  తగ్గింపు ధరల ఆఫర్ ద్వారా  నాలుగు  ప్రధాన మార్గాల్లో  ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-కోలకతా, ఢిల్లీ-బెంగళూరు మధ్య ప్రయాణించేవారికి  భారీ ఊరట కల్పిస్తోంది.



ముఖ్యంగా చివరి నిమిషంలో  ప్రయాణించే వారికి  ఈ ఆఫర్  మంచి అవకాశం. అయితే విమానం బయలుదేరే నిర్దిష్ట  సమయానికి కేవలం నాలుగు గంటలముందు బుక్  చేసుకోవాలని తెలిపింది.  రాజధాని ట్రైన్ లోని  2-టైర్ ఏసీ  టికెట్ ఛార్జీలకు కంటే తక్కువగా ఉండనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.  రాజధాని ఎక్స్ ప్రెస్ ఎసీ టు టైర్ ధరలు ఢిల్లీ-ముంబై రూ. 2,870, ఢిల్లీ-చెన్నై  రూ.3,905. ఢిల్లీ-కోలకతా రూ.2,890 ఢిల్లీ-బెంగళూరు రూ.4,095 లుగా ఉన్నాయి. అంటే.. చివరి నిమిషంలో ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకుంటే ఈ ధరకంటే తక్కువ ధరలకే.. తక్కువ సమయంలో విమానంలో  ప్రయాణించవచ్చన్నమాట.  ఈ నేపథ్యంలో లాస్ట్ మినిట్ లో 2 నుంచి 3 రెట్లు అదనంగా  వసూలు చేసే ప్రయివేట్  ఎయిర్ లైన్స్ కు ఇది  షాకింగ్ న్యూసే.



చివరి నిమిషంలో విమాన ప్రయాణాన్ని ఎంచుకునే ప్రయాణికులకు అందుబాటు ధరలతో ఉపశమనం అందించడంతోపాటు, మిగిలిన ఖాళీ సీట్లు పూరించడమే తమ లక్ష్యమని  ఎయిర్ ఇండియా  సీఎండీ అశ్వనీ లోహానీ చెప్పారు. ఇది ప్రయాణీకులకు సరసమైన ధరల్లో టికెట్లు లభ్యం, తమకు ఆదాయం పెరగడానికి సహాయ పడుతుందని తెలిపారు.



కాగా  గత నెలలో దేశ‌వ్యాప్తంగా ఉన్న రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జూన్ 26 నుంచి మొదలై సెప్టెంబర్ 30 తో  ముగిసే  ఓ 'సూపర్ సేవర్'   పథకాన్ని ప్రవేశపెట్టింది.   రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులు రైల్వే టికెట్ క‌న్ఫామ్ కాని వారికోసం బంప‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది.  రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌ల‌లో ఏసీ ఫ‌స్ట్‌క్లాస్ టికెట్ ఖ‌రారు కానివారు...విమానం బ‌య‌లుదేరే నాలుగు గంట‌ల ముందు ఫ్లైట్ టికెట్ తీసుకునే అవకాశాన్ని   ఎయిర్ ఇండియా  కల్పించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top