ఎయిర్‌ కోస్టా చేజారిన విమానాలు

ఎయిర్‌ కోస్టా చేజారిన విమానాలు


ఉన్న రెండూ జీఈ క్యాపిటల్‌ వద్ద లీజుకు తీసుకున్నవే

జీఈ అభ్యర్థనతో రద్దు చేసిన డీజీసీఏ




హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ ఎయిర్‌ కోస్టాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్‌ కోస్టా పేరున నమోదైన రెండు విమానాలను కేంద్ర పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) రద్దు చేసింది. ఇప్పటికే పైలట్లతో సహా సగానికిపైగా సిబ్బంది కంపెనీకి గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. తాజాగా డీజీసీఏ తీసుకున్న నిర్ణయం కంపెనీకి పెద్ద షాక్‌ అని చెప్పవచ్చు. 112 సీట్లున్న ఎంబ్రార్‌ ఈ–190 రకానికి చెందిన ఈ విమానాలను జీఈ క్యాపిటల్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ సమకూర్చింది.


విమానాలను లీజుకు తీసుకున్న ఎయిర్‌ కోస్టా అద్దె చెల్లించకపోవడంతో జీఈ అభ్యర్థన మేరకు డీజీసీఏ తాజా నిర్ణయం తీసుకుంది. రెండు విమానాలను జీఈ తన స్వాధీనంలోకి తీసుకుంది. 2017 ఫిబ్రవరి 28 నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మే 31 వరకు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ఎయిర్‌ కోస్టా ఇది వరకే ప్రకటించింది.



ఆందోళనకు సిబ్బంది రెడీ..: ఉద్యోగులకు చెల్లించాల్సిన జనవరి, ఫిబ్రవరి వేతనాలను కంపెనీ ఇప్పటికీ చెల్లించలేదు. మొత్తం 600 మంది ఉద్యోగుల్లో సగానికి పైగా కంపెనీకి రాజీనామా చేశారు. మిగిలినవారూ ఒక్కరొక్కరుగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. 40 మంది పైలట్లు సైతం ఇతర సంస్థల్లో చేరిపోయారు. వేతనాలు ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో మిగిలిన ఉద్యోగులు పోరాటానికి దిగాలని నిర్ణయించినట్టు ఒక సీనియర్‌ ఉద్యోగి సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. విజయవాడలోని కంపెనీ కార్యాలయం ముందు నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారాయన. ఇంత జరుగుతున్నా ఎల్‌ఈపీఎల్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. మే 31 తర్వాత కూడా ఎయిర్‌ కోస్టా సర్వీసులు పునరుద్ధరించే చాన్స్‌ లేదని స్పష్టమవుతోందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top