కొత్త ఏడాదిలో 20 వేల కోట్ల పెట్టుబడులు

కొత్త ఏడాదిలో 20 వేల కోట్ల పెట్టుబడులు - Sakshi


వాహన కంపెనీల ఉత్సాహం



న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ కొత్త ఏడాదిలో కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా ప్రవేశిస్తోంది. మరో పది రోజుల్లో ముగుస్తున్న 2014 ఏడాది ఆశించిన విధంగా లేనప్పటికీ, వివిధ వాహన కంపెనీలు కొత్త ఏడాదిలో రూ.20,500 కోట్లు (సుమారుగా 500 కోట్ల డాలర్ల) వరకూ పెట్టుబడులు పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్,  హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో తదితర సంస్థలు ఇప్పటికే తమ పెట్టుబడుల ప్రణాళికలను వెల్లడించాయి.కొత్త ఉత్పత్తులు, మార్కెటింగ్ కోసం  మారుతీ సుజుకీ వచ్చే ఏడాది రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.



మహారాష్ట్రలోని చకన్ ప్లాంట్ విస్తరణ నిమిత్తం మహీంద్రా కంపెనీ ఏడేళ్లలో రూ.4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నది. మహారాష్ట్రలోని ప్లాంట్ల విస్తరణ కోసం బజాజ్ ఆటో రూ.2,000 పెట్టుబడులు పెడుతోంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ సంస్థ భారత్‌లో తన వ్యాపార విస్తరణ కోసం రూ.800 కోట్లు వ్యయం చేయనున్నది. కొత్త హ్యాచ్‌బాక్‌ను, ఎస్‌యూవీని, హ్యాచ్‌బాక్‌ల కోసం ఈ కంపెనీ ఈ స్థాయి పెట్టుబడులు పెడుతోంది. హీరో మోటోకార్ప్ కంపెనీ విస్తృతంగా విదేశీ మార్కెట్లలో విస్తరించనున్నది.



అమెరికా, బ్రెజిల్, యూరప్ దేశాలతో పాటు స్వదేశంలోని ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ కోసం ఈ కంపెనీ రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. భారత్‌లో రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. 2020 కల్లా 50కు పైగా దేశాల్లో 20కి పైగా అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని హీరో మోటోకార్ప్ లక్ష్యంగా పెట్టుకుంది.



హీరో మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ గుజరాత్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడులతో స్కూటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఇది ఉత్పత్తి ప్రారంభించవచ్చు. ఇవే కాకుండా వివిధ వాహన విడిభాగాల కంపెనీలు కూడా భారీ పెట్టుబడులతో రానున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top