మేమిద్దరం... మాకొక్కటి..!

మేమిద్దరం... మాకొక్కటి..!


ఒక వ్యక్తి తప్పనిసరి ఆర్థిక ప్రణాళిక అంటే... అది సమగ్ర, సంపూర్ణ జీవిత బీమా ప్రణాళిక. తన అవసరాలకు తగిన బీమా కలిగి ఉండడం ఎవ్వరికైనా ధీమానే. ఇది బీమాకు సంబంధించి ప్రాథమిక అంశం. సంఘంలో ఒకనిగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు సరే  కానీ కాలక్రమంలో మనిషి  బాధ్యతలు పెరుగుతాయి. వివాహం... భాగస్వామిగా మరో వ్యక్తితో  కలిసి వ్యాపార సంబంధాలు... ఇలా మనిషి కార్యకలాపాలు విస్తృతమవుతాయి.



అలాంటి వారి విషయంలో ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి వారి అవసరాలకు అనుగుణంగా బీమా ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక విషయంలోనూ ఇదే విధమైన ప్రొడక్టులు రూపుదిద్దుకుంటుండడం సానుకూల పరిణామం.

 

పరస్పర ప్రయోజనం: ఒకరిపై ఒకరు ఆధారపడి సాగించే జీవన ప్రయాణంలో ఉమ్మడి జీవిత బీమా ప్రణాళిక ఎంతో అవసరం. అది వివాహం కావచ్చు... లేదా వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. ఒక మంచి టర్మ్ ప్లాన్‌తో వ్యక్తి సాగించే ప్రయాణంలో ఆ వ్యక్తితో జతగూడే జీవిత భాగస్వామి కావచ్చు.. లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు.. వారిని ఉమ్మడి జీవిత బీమా బాటలో కూర్చే సౌలభ్యత ఇక్కడ ఉంది. ఆ మేరకు ఉపయోగాలు ఇక్కడ లభిస్తున్నాయి.

 

వ్యత్యాసాలు: ప్రధానంగా రెండు వేర్వేరు ప్రయోజనాలను ఈ ప్రొడక్టులు అందిస్తున్నాయి.

 

ఇందులో ప్రధానమైనది బీమా మొత్తం ఒకటిగా ఉండవచ్చు. లేదా రెండు వేర్వేరుగానూ ఉండవచ్చు... సింగిల్‌గా ఈ బీమా మొత్తం ఉన్నప్పుడు... దురదృష్టవశాత్తు భాగస్వామి మరణిస్తే మరొకరికి బీమా మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ సందర్భంలో పాలసీ ముగుస్తుంది. అయితే కవరేజ్ వేర్వేరుగా ఉన్నప్పుడు ఒక సభ్యుడు మరణిస్తే, సంబంధిత ప్రయోజనం (బీమా మొత్తం) అంతా చెల్లించినప్పటికీ... జీవించి ఉన్న వ్యక్తి పాలసీ, బీమా మొత్తం కొనసాగుతుంది.

 

లాభాలు...

నిర్వహణ: ఒకే పాలసీ, ఒకే ఒక్క బీమా మొత్తంతో పోల్చిచూస్తే... జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. ముఖ్యంగా చిన్న కుటుంబం... అలాగే భాగస్వామ్యంలో జరిగే వ్యాపార కార్యకలాపాల్లో ఈ పాలసీ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. వ్యయం, నిర్వహణ, ప్రీమియం చెల్లింపు ఇత్యాది విషయాలన్నింటిలో వెసులుబాటును కల్పిస్తుంది. అలాగే ఉమ్మడి ఆస్తులు, తనఖా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నా ఈ తరహా పాలసీలు ఎంతో సానుకూలం.

 

వెసులుబాటు: ఈ తరహా ప్రొడక్టుల్లో టర్మ్ ప్లాన్ కొనసాగుతున్న ఒక వ్యక్తి... కాలక్రమంలో అవసరమైతే తన జీవిత భాగస్వామిని కూడా చేర్చుకుని దీనిని జాయింట్ లైఫ్ ప్లాన్‌గా మలుచుకునే అవకాశం ఉంటుంది. విడాకుల కేసుల్లో ప్రాథమిక పాలసీదారు... పాలసీలో రెండవ వ్యక్తిని తొలగించుకునే వీలుంటుంది.

 

భద్రత: జీవిత భాగస్వాముల భద్రత విషయంలో ఈ పాలసీ లాభం అపరిమితం. ప్రధానంగా ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్న సహ భాగస్వామికి ఈ తరహా పాలసీలు కొండంత అండనిస్తాయి. పిల్లల భవిష్యత్, రుణాల చెల్లింపులు, వ్యాపార కార్యకలాపాల్లో ఆర్థిక నష్టాల నివారణ... ఇలా అన్ని రకాలుగా ఇవి ప్రయోజనకరం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top