3జీ స్పెక్ట్రం బేస్ ధర ఖరారు

3జీ స్పెక్ట్రం బేస్ ధర ఖరారు - Sakshi


న్యూఢిల్లీ: త్వరలో నిర్వహించబోయే 3జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి కనీస ధరను మెగాహెట్జ్‌కు రూ. 3,705 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం ఖజానాకు కనీసం రూ. 17,000 కోట్లు సమకూరగ లవని అంచనా. మిగతా బ్యాండ్‌లలో కూడా స్పెక్ట్రంను వేలం వేయడం ద్వారా వచ్చే దాన్ని కూడా కలిపితే ఖజానాకు దాదాపు రూ. 1,00,000 కోట్ల పైచిలుకు రాగలవని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఇది అత్యంత భారీ స్థాయి స్పెక్ట్రం వేలం కానుంది.



ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం భేటీ అయిన కేంద్ర క్యాబినెట్ 3జీ సర్వీసులకు ఉపయోగపడే 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం కనీస ధరకు ఆమోదముద్ర వేసింది. ఈ రేటు ప్రకారం కనీసం రూ. 17,555 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రం కనీస ధరను మెగాహెట్జ్‌కు రూ. 700 కోట్లు కింద నిర్ణయించగా అంత కు 8 రెట్లు అధికంగా రూ. 3,350 కోట్లు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ డిమాండ్‌ను అధ్యయనం చేసి రేటు నిర్ణయించినట్లు వివరించారు.



ఇది టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసిన దానికన్నా 36 శాతం, 2010 వేలంలో వచ్చిన దాని కన్నా 11 శాతం అధికం.  2జీ స్పెక్ట్రం కనీస రేటు ప్రకారం ఖాజానాకు మొత్తం మీద రూ. 64,840 కోట్లు రాగలవు.  ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం 2జీ స్పెక్ట్రం విక్రయం ద్వారా రూ. 16,000 కోట్లు, 3జీ స్పెక్ట్రం వేలం ద్వారా రూ. 5,793 కోట్లు రాగలవని అంచనా.  మొత్తం మీద  కోల్ ఇండియాలో వాటాల విక్రయం కూడా కలిపితే.. దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు సమీకరించేలా కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది.



అటు  చక్కెర, ఆహారధాన్యాల ప్యాకేజింగ్ కోసం తప్పనిసరిగా జూట్‌ను ఉపయోగించే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. దీని ప్రకారం చక్కెర మొత్తం ఉత్పత్తిలో 20 శాతాన్ని, ఆహారధాన్యాల్లో 90 శాతాన్ని జూట్‌తో ప్యాకేజింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది 40 లక్షల వ్యవసాయ కుటుంబాలకు, అంతిమంగా జూట్ రంగానికి ప్రయోజనం చేకూర్చగలదని అధికారిక వర్గాలు తెలిపాయి.

 

స్పెక్ట్రం కొరతేమీ లేదు..: 3జీకి సంబంధించి మరింత స్పెక్ట్రం కావాలంటూ పరిశ్రమ డిమాండ్ చేస్తుండటంపై స్పందించిన మంత్రి.. స్పెక్ట్రం కొరత ఉందంటూ అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నంత స్పెక్ట్రంను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top