2003-08 ర్యాలీ పునరావృతం

2003-08 ర్యాలీ పునరావృతం


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీ సుదీర్ఘకాలం కొనసాగుతుందని, 2003-08లో జరిగిన ర్యాలీ పునరావృతమయ్యే అవకాశాలున్నాయని మ్యూచువల్ ఫండ్ సంస్థ యూటీఐ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ప్రధానంగా ఆరు బుల్ ర్యాలీలు నమోదు కాగా అందులో 2003-08 ర్యాలీ తప్ప మిగిలినవన్నీ ఒక కారణంతో జరిగాయని, కానీ 2003-08 ర్యాలీ దేశ ఆర్థిక మూలాలకు అనుగుణంగా జరిగిందని యూటీఐ ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్ తెలిపారు.



అదే విధంగా ప్రస్తుత ర్యాలీ కూడా దేశీయ ఫండమెంటల్స్ ఆధారంగానే జరుగుతున్నట్లు కనపడుతోందని, ఇది దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. మంగళవారం యూటీఐ కొత్త ఫండ్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరు బుల్ ర్యాలీల సగటు కాలపరిమితి 90 వారాలుగా ఉండి 171 శాతం లాభాలను అందిస్తే, గడిచిన ర్యాలీ సుదీర్ఘకాలంగా అంటే 246 వారాలు జరగడమే కాకుండా అత్యధికంగా 614 శాతం లాభాలను అందించినట్లు తెలిపారు. ప్రస్తుత ర్యాలీ మొదలై 68 వారాలు అయ్యిందని, ఈ సమయంలో సూచీలు 50 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయన్నారు.



 అన్ని సానుకూలాంశాలే..

 స్టాక్ మార్కెట్ ర్యాలీని ప్రభావితం చేసే అయిదు అంశాల్లో రుణాలకు డిమాండ్ పెరగక పోవడం తప్ప మిగిలిన నాలుగు అంశాలు అంటే ద్రవ్యోల్బణం తగ్గడం, వడ్డీరేట్లు తగ్గడానికి సానుకూల వాతావరణం ఏర్పడటం, కంపెనీల లాభాల్లో వృద్ధి మొదలవడం, కంపెనీల షేర్ల విలువలు ఆకర్షణీయంగా ఉండటం అనేవి స్టాక్ సూచీలు మరింత పెరుగుతుయడానే నమ్మకాన్ని కలిగిస్తున్నాయని నంబియార్ తెలిపారు.



1995 నుంచి పరిశీలిస్తే ఏటా రుణాల్లో కనిష్టవృద్ధి సగటున 9.62%గా ఉం టే ఇప్పుడిది 9.72% గా ఉందని, ఈ గణాం కాలు క్రెడిట్ డిమాండ్ కనిష్టస్థాయికి చేరిందన్న అంశాన్ని తెలియ చేస్తోందన్నారు. 1997లో రుణాల్లో వృద్ధి కనిష్టంగా 9.6 శాతంగా ఉంటే, 2006లో గరిష్టంగా 30.88 శాతంగా నమోదయ్యింది. ఇప్పుడిప్పుడే కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో రుణాలకు డిమాండ్ పెరుగుతోందని, ఒక్కసారి విద్యుత్, కోల్, ఇన్‌ఫ్రా రంగాల సమస్యలు పరిష్కారమైతే పారిశ్రామిక రుణాలకు డిమాండ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  



కంపెనీల ఎబిటా మార్జిన్ కూడా పదేళ్ల కనిష్ట సగటుకు చేరిందని, ఇది రానున్న కాలంలో పెరిగే అవకాశం ఉందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గడం, ముడి చమురు ధరలు, బంగారం ధరలు తగ్గడంతో ద్రవ్యలోటు కూడా తగ్గుముఖం పట్టిందని, దీంతో ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించడానికి మార్గం ఏర్పడిందన్నారు. మార్చి తర్వాత నుంచి వడ్డీరేట్లు తగ్గవచ్చన్నారు.



 ఒడిదుడుకులు తప్పవు

 ప్రతీ బుల్ ర్యాలీ మధ్యలో చిన్న చిన్న కరెక్షన్‌లు ఉంటాయని, వీటిని కొనుగోళ్లకు వినియోగించుకోవాలని నంబియార్ సూచించారు. 2003-08 మధ్య జరిగిన సుదీర్ఘ ర్యాలీ ఆరుసార్లు సర్దుబాటుకు గురయ్యిందని, ప్రస్తుత ర్యాలీ కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. ప్రస్తుత కరెక్షన్ ఎప్పుడు ఎందుకు వస్తుందో చెప్పలేమన్నారు. రాజ్యసభలో జీఎస్‌టీ, బీమా బిల్లులు ఆమోదానికి ఆటం కం ఎదురైనప్పుడు లేదా ఉక్రెయిన్, ఇస్లామిక్ మిలిటెంట్స్ వంటి సంఘటనల రూపంలోనైనా ఈ కరెక్షన్ రావచ్చన్నారు.



 వచ్చే నెలలో కొత్త పథకం

 యూటీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్-2 న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 4న ప్రారంభమై డిసెంబర్ 18తో ముగియనుంది. ఇది 1,102 రోజుల క్లోజ్‌డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఎన్‌ఎఫ్‌వో ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సిరీస్-1లో రూ. 500 కోట్లు లక్ష్యం పెట్టుకోగా రూ. 770 కోట్లు సమీకరించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top