మోడీ @100...సెన్సెక్స్@27,000

మోడీ @100...సెన్సెక్స్@27,000 - Sakshi


నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన మొదలై 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 27,000 పాయింట్లను అధిగమించింది. జీడీపీ జోష్, కరెంట్ ఖాతా లోటు కట్టడి, మోడీ సంస్కరణలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు... వెరసి వరుసగా 8వ రోజు సెన్సెక్స్ లాభాలు అందుకుంది. సెన్సెక్స్  ఇంట్రాడేలో గరిష్టంగా 27,083కు చేరి చివరికి 152 పాయింట్ల లాభంతో 27,019 వద్ద ముగిసింది.



ఇక నిఫ్టీ కూడా ఒక దశలో 8,102ను తాకింది. ట్రేడింగ్ ముగిసేసరికి 55 పాయింట్ల లాభంతో 8,083 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, సెన్సెక్స్ 26,000 పాయింట్ల నుంచి 27,000కు చేరడానికి 40 ట్రేడింగ్ రోజులు తీసుకుంది. అంటే జూలై 7న 26,000ను తాకగా, సెప్టెంబర్ 2న 27,000ను దాటింది.



 ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రెండున్నరేళ్ల తరువాత జీడీపీ 5.7% వృద్ధిని సాధించగా, కరెంట్ ఖాతా లోటు 4.8% నుంచి 1.7%కు పడిపోవడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు.  రానున్న ఐదేళ్లలో 34 బిలియన్ డాలర్లను ఇండియాలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు జపాన్ ప్రకటించడం మరింత బలాన్నిచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. కాగా, మోడీ పాలనలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో సెన్సెక్స్ 9 శాతం పెరగడం గమనార్హం.



 ఎఫ్‌ఐఐల జోరు..: సోమవారం రూ. 554 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 673 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కాగా, ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు వినియోగించే జనరిక్ ఔషధాన్ని జర్మనీ, స్వీడన్‌లలో విక్రయించేందుకు అనుమతి పొందిన  సిప్లా 5.2% ఎగసింది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 4-2% మధ్య పుంజుకోగా, సెసాస్టెరిలైట్, టాటా పవర్, హిందాల్కో, విప్రో 2-1% మధ్య నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 1,738 లాభపడగా, 1,250 తిరోగమించాయి. తమ గ్రూప్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు జపాన్ బ్యాంక్ ఇంటర్నేషనల్(జేబీఐసీ)తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న జీఎంఆర్ షేరు 3.5% బలపడి రూ. 26.65 వద్ద ముగిసింది.



 ఏడాది గరిష్టానికి 323 షేర్లు

 రోజురోజుకీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మార్కెట్ల బాటలో పలు షేర్లు సైతం లాభాలతో పరుగుతీస్తున్నాయి. ఇప్పటికే పలు స్టాక్స్ ఏడాది గరిష్టాలను తాకగా, తాజాగా ఈ జాబితాలో 323 కంపెనీలు చేరాయి. వీటిలో ఏసీసీ, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, లుపిన్, ఐవోసీ, ఎంఅండ్‌ఎం, మారుతీ, టెక్ మహీంద్రా వంటి దిగ్గజాలుండటం విశేషం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top