చర్చలేకుండానే..


 శ్రీకాకుళం: జిల్లా పరిషత్ బడ్జెట్‌పై ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం జరిగింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు 1వ స్థాయీ సంఘ సమావేశం, అటు తరువాత బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం జరుగుతుందని అధికారులు ముందుగానే ప్రకటించారు. అయితే నాలుగు గంటల వరకు నలుగురు ఐదుగురు సభ్యులు మాత్రమే వచ్చారు. అధికారులు 1వ స్థాయీ సంఘ సమావేశం ప్రారంభం అవుతుందని ప్రకటించి బడ్జెట్ అంకెలను చదివి విన్పించారు. దీంతో స్థాయీ సంఘ సమావేశ సభ్యులైన ముగ్గురు జెడ్పీటీసీలు మౌనం వహించడంతో బడ్జెట్‌ను స్థాయీ సంఘం ఆమోదిస్తున్నట్టు సీఈవో ప్రకటించారు.

 

 అటు తరువాత ఈ బడ్జెట్‌ను జెడ్పీ పాలకవర్గం ఆమోదించాలని కోరగా ఏ ఒక్కరూ చర్చ ప్రారంభించక పోవడంతో బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్టు సీఈవో ప్రకటించారు. అప్పటికీ 14 మంది సభ్యులు ఉండగా 13 మంది సభ్యులు ఉంటే కోరం ఉన్నట్టు అని తేల్చి బడ్జెట్‌ను ఆమోదించినట్లు సీఈవో తెలిపారు. వాస్తవానికి చైర్‌పర్సన్ అధ్యక్ష హోదాలో ఆమోదిస్తున్నట్టు ప్రకటించాల్సి ఉండగా అందుకు భిన్నంగా సీఈవో ప్రకటించారు. హాజరైన 14 మంది సభ్యుల్లో ఎక్కువగా వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారు. ఈ సమయంలో పాలకొండ శాసనసభ్యురాలు విశ్వసరాయ కళావతి సమావేశానికి వచ్చి పాలకొండ డివిజన్‌లో రోడ్ల పనుల విషయమై అధికారులను ప్రశ్నించారు. శ్రీకాకుళం శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి రాగా కొద్దిసేపటి తరువాత ఇచ్ఛాపురం శాసన సభ్యులు బెందాళం అశోక్, పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు వచ్చారు.  

 

 రూ.30.17 కోట్ల మిగులుతో అంచనా బడ్జెట్

 2015-16 అంచనా బడ్జెట్‌ను రూ.30.17 కోట్ల మిగులుతో ఆమోదించారు. 2014-15 సవరణ బడ్జెట్‌ను రూ.29.44 కోట్లతో ప్రతిపాదించగా దానికి కూడా ఆమోదం తెలిపారు. 2014-15 సవరణ బడ్జెట్‌లో ఆదాయాన్ని రూ.207.19 కోట్ల వ్యయం రూ.177.75 కోట్లగా పొందుపరిచారు. 2015-16 సంవత్సరపు అంచనా వ్యయం 223.02 కోట్లుగానూ, వ్యయం రూ. 192.85 కోట్లగా పేర్కొన్నారు. 2014-15 బడ్జెట్‌కు 10 శాతాన్ని పెంచి 2015-16

 అంచనా బడ్జెట్‌ను రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు.  

 

 నీటి ఎద్దడికి ముందస్తు చర్యలు

 వేసవిలో నీటి ఎద్దడి తట్టుకునేలా చర్యలు చేపడతామని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మీ తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకటో స్థాయీ సంఘ సమావేశం, ప్రత్యేక సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షరాలు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్దానంలోని 250 పంచాయతీలకు రూ.4.44 లక్షలతో మంచినీటి సమస్యలు పరిష్కారానికి తొలి సంతకం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. సోంపేట మండలంలోని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగంలో సిబ్బంది కొరత ఉన్నందున సిబ్బందిని నియమంచాలని ఎస్‌ఈని ఆదేశించారు. ప్రతీ మండలంలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు  ప్రకటించారు. జిల్లాలో 175 బాలుర, 100 బాలికల ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్లు సౌకర్యం కల్పిస్తామన్నారు. హుద్‌హుద్ తుపానుకు పాలకొండ డివిజన్‌కు ఎన్ని నిధులు మంజూరు చేశారు.. ఎన్ని పనులను పూర్తి చేశారు చెప్పాలని పంచాయతీరాజ్ అధికారులను జెడ్పీటీసీ సామంతుల దామోదరరావు, శాసన సభ్యురాలు విశ్వసరాయి కళావతిలు కోరారు. పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పందిస్తూ, జెడ్పీటీసీ, ఎమ్మీటీసీ సభ్యులకు తప్పనిసరిగా పూర్తి వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణా అధికారి మాట్లాడుతూ అన్ని డివిజన్ కేంద్రాల్లో గ్రామీణ మంచినీటి సరఫరా అధికారులతో వేసవి నీటి ఎద్దడిపై సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు.

 

 అంతా అతగాడే..

 శ్రీకాకుళం: జిల్లాపరిషత్ బడ్జెట్ సమావేశం యావత్తూ సంతోష్ అనే చిరు ఉద్యోగి కనుసన్నల్లో జరిగినట్లు కన్పించింది. జెడ్పీ చైర్‌పర్సన్ సీసీగా పనిచేస్తున్న సంతోష్ జిల్లా పరిషత్‌లో టైపిస్టు అయినప్పటికీ సీఈవో స్థాయి నుంచి అన్ని స్థాయిల వారికి ఆదేశాలు జారీ చేస్తూ కన్పించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచనలు చేస్తూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో కూడా చైర్‌పర్సన్‌కు సూచనలు ఇచ్చేశాడు. ఎంపీని వేదికపైకి రావాలని కూడా ఈయనే ఆహ్వానించి వేదికపైన ఆశీనులు కావచ్చో లేదోనని ఎంపీ ఆలోచిస్తుండగా పర్వాలేదంటూ వేదికపైకి తీసుకువెళ్లారు. సమావేశం కొనసాగుతుండగా ఇక ముగించేయండి అని కూడా సీఈవోకు సూచించడం కన్పిం చింది. ఈ ఉద్యోగి వ్యవహారం సమావేశంలో చర్చనీయాంశమైంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top