'భూమా ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం'

'భూమా ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం' - Sakshi


కర్నూలు: పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆయనకు ఏదైనా జరిగితే జిల్లా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. భూమాపై అక్రమ కేసుల నమోదు, అరెస్టు, జైలుకు తరలింపు నేపథ్యంలో కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత, మణిగాంధీ, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డిలు మాట్లాడారు.



భూమా నాగిరెడ్డికి ఇప్పటికే గుండె శస్త్రచికిత్స జరిగిందని.. బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారన్నారు. అయినప్పటికీ పోలీసులు నిమ్స్‌కు తరలించేందుకు సెక్యూరిటీ ఇవ్వలేమంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు. మహిళా శాసనసభ్యురాలు అని కూడా చూడకుండా భూమా అఖిలప్రియతో పోలీసులు నువ్వు అని సంబోధిస్తూ అమర్యాదగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్‌తో పోలీసులు ప్రవర్తించిన తీరు, మహిళా ఎమ్మెల్యేతో వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా ప్రవేశపెడతామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top