పతంజలి గ్రూపు చంద్రబాబు చుట్టమా?

పతంజలి గ్రూపు చంద్రబాబు చుట్టమా? - Sakshi


► పేదల భూములతో వ్యాపారాలా...


► దళితులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుంది

► అడ్డగోలు అప్పగింతపై అసెంబ్లీలో నిలదీస్తారు

► అధికారంలోకి రాగానే సెంటుభూమికి లెక్కగట్టి జగన్‌ అన్న ఇస్తారు

► బడుగులకు భరోసా నిచ్చిన డాక్టర్‌ మేరుగ


కొత్తవలసరూరల్‌(శృంగవరపుకోట): నిరుపేద, దళితులు సాగుచేసుకుంటున్న కోట్లాదిరూపాయల విలువ చేసే సర్కారు భూములు కారుచౌకగా పతంజలి సంస్థకు కట్టబెట్టడానికి అదేమైనా చంద్రబాబు బంధువా... అని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున మండిపడ్డారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం దళితులకు ప్రతీ సెంటు భూమి లెక్కగట్టి ఇస్తారని తెలిపారు. పతంజలి సంస్థకు ధారాదత్తం చేయడానికి ఎంపిక చేసిన భూములను సోమవారం పరిశీలించిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడారు. అడ్డగోలుగా జరుగుతున్న ఈ పందేరంపై అసెంబ్లీలో జగన్‌ నిలదీస్తారని... హామీ ఇచ్చారు.


చినరావుపల్లిలో ఎకరా రూ. 30 లక్షలవరకూ ఉంటే రూ. 7.50 లక్షలకు ధర నిర్ణయించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రూ. 2.50 లక్షలకే ఆ భూమిని పతంజలికి ధారాదత్తం చేయటంలో గల ఆంతర్యమేమిటని నిలదీశారు. దళితులు, గిరిజనులకు అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో ఉద్యమం చేపడతామని తెలిపారు. దివంగతనేత రాజశేఖర్‌ రెడ్డి భూమిలేని పేదవారికి లక్షల ఎకరాలు పంపిణీచేస్తే, చంద్రబాబు దళితుల భూములు లాక్కుని వ్యాపారం చేస్తే దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.


చినరావుపల్లి భూములు స్థానిక ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి,  తహసీల్ధార్‌ కె.ఆనందరావు  భయపెట్టి లాక్కున్నారని, తరతరాలుగా తమ సాగులో ఉన్నప్పటికీ పాసుపుస్తకాలు, పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.


వైఎస్‌ హయాంలోనే అంబేడ్కర్‌ ఆశయాల అమలు

అంబేడ్కర్‌ అలోచనా విధానంతోనే డాక్టర్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన చేశారని,  చంద్రబాబు పాలనలో దళితులపై వివక్ష ఎక్కువైందని మేరుగ తెలిపారు. ప్రభుత్వ అవసరాలకు భూములు అవసరమైతే రైతులతో మాట్లాడి వాటిని సర్వేచేసి వారి హక్కు ప్రకారం నష్టపరిహారం చెల్లించి వారి ఇష్ట్రపకారం తీసుకోవాలి తప్ప పతంజలి పేరిట లాక్కుంటే సహించబోమని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు జైహింద్, ఎస్‌కోట నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నాయుడుబాబు, సింగంపల్లి వాసు, మండల వైసీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు తిర్రి కోటేశ్వరరావు, వేపాడ కన్వీనర్‌ మెరపల సత్యనారాయణ, దళిత నాయకులు రిట్టపల్లి అప్పన్న, దూసి అప్పారావు, రెబార్కి రవికుమార్, పి సూరిబాబు, అడిగర్ల గోవింద, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top