మా గొంతు నొక్కేసి వాళ్లతో మాట్లాడిస్తారా?

మా గొంతు నొక్కేసి వాళ్లతో మాట్లాడిస్తారా? - Sakshi


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనలు అసెంబ్లీ చరిత్రలోనే సిగ్గుచేటుగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి ప్రతిపక్షం వాకౌట్ చేసిన తర్వాత ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''అసెంబ్లీలో జరిగిన సంఘటన అసెంబ్లీ చరిత్రలోనే సిగ్గుచేటు. ఒక శాసనసభ్యుడికి మైకిచ్చి, చర్చ మొదలుపెట్టమంటే.. హత్యలు, ఊచకోతలపైన మాట్లాడమంటే దాని మీద వివరించాల్సిన మా గొంతు నొక్కేసి బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. ఆయనేమో అసలు విషయం వదిలేసి ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీం, విదేశాలు అంటున్నాడు. మతి భ్రమించి మాట్లాడుతున్నాడు.



ఆయన అలాంటి అసత్య ఆరోపణలు చేస్తుంటే స్పీకర్ గారికి చెవికి ఇంపుగా ఉన్నాయా, జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే ఆనందంగా ఉందా? అలాంటి సందర్భంలోనే స్పీకర్ గారిని ప్రతిపక్ష నాయకుడు అడిగారు. అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని అంటుంటే.. పది సెకన్లు కూడా మాట్లాడనివ్వకుండా మైకు కట్ చేసి మళ్లీ బుచ్చయ్య చౌదరికే అవకాశం ఇచ్చారు.



ప్రతిపక్ష నాయకుడు వాకౌట్ చేస్తానన్నప్పుడు కనీసం మైకు ఇచ్చి ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. వీటిని అధికార పార్టీ, స్పీకర్ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మీరే నిబంధనలు పట్టించుకోకుండా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అసలు స్పీకర్ ఎందుకు ఉన్నారని అడుగుతున్నా. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారా.. ప్రజల తరఫున మాట్లాడటానికి, ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షంగా మేముంటే, మా గొంతు నొక్కేస్తారా, ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నా. నిండు సభలో ప్రతిపక్ష నాయకుడి మీద నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేస్తుంటే పట్టించుకోకపోవడం నిజంగా బ్లాక్ డే. అడిగినా మైకు ఇవ్వకుండా వ్యవహరించడం సరికాదు.



మంత్రులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకు పుచ్చలపల్లి సుందరయ్య పేరు ఎత్తే అర్హత లేదు. వాళ్లే బతికుంటే మీ తీరు చూసి కన్నీళ్లు పెట్టుకునేవారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంలా మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇది దుర్మార్గం, అమానుషం. ప్రజలను, ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేయడం. యనమల రామకృష్ణుడు పెద్ద నీతిమంతుడు అయినట్లు హితోపదేశం చేస్తున్నారు. అదేదో వాళ్ల పార్టీ శాసనసభ్యులకు చెప్పాలి. కవి చౌడప్ప వారసుల్లా మాట్లాడుతున్నారు'' అని ఆయన అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top