పంటలు వద్దనడానికి మీరెవరు?

పంటలు వద్దనడానికి మీరెవరు? - Sakshi


సీఆర్‌డీఏ కమిషనర్‌పై వైఎస్సార్‌సీపీ ధ్వజం

ఏ అధికారంతో రైతులను శాసిస్తున్నారు?

రైతుల ప్రాథమిక హక్కుల్ని ఎలా కాలరాస్తారు?

భూములివ్వనివారిని అణగదొక్కేందుకే శ్రీకాంత్‌ను చంద్రబాబు తెచ్చారు

సోంపేట, కాకరాపల్లి రైతుల్ని పొట్టన పెట్టుకున్న చరిత్ర ఆయనది

వచ్చే సీజన్ నుంచి పంటలేయవద్దని శాసిస్తే.. చూస్తూ ఊరుకోం

రైతుల పక్షాన పోరాడుతాం.. న్యాయస్థానాలనూ ఆశ్రయిస్తాం




సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో వచ్చే సీజన్ నుంచి పంటలు వేసుకోవడానికి అనుమతి లేదన్న ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. పంటలు వేసుకోవద్దని నిషేధం విధించడానికున్న అధికారాలేంటని ప్రశ్నించింది. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సీజన్ నుంచి పంటలు వేసుకోవడానికి అనుమతి లేదంటూ సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు.



‘‘ఏపీ రాజధాని ప్రాంతంలో రైతులను పంట వేసుకోవద్దని చెప్పడానికి సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఎవరు? ఏ అధికారంతో రైతులను శాసిస్తున్నారు? దమ్ముంటే రైతులు పంట వేసుకోవద్దని జీవో ఇమ్మనండి. ఆయన ఏమైనా రాష్ట్రపతా? లేక రాజ్యాంగేతర శక్తా? రైతుల ప్రాథమిక హక్కులు ఎలా కాలరాస్తారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు భూములివ్వకపోతే, ఉద్యమిస్తే అణగదొక్కడమేగాక.. వారిని శవాలుగా మార్చయినాసరే రాజధాని నిర్మించాలనే సంకల్పంతోనే సీఎం చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏ కమిషనర్‌గా శ్రీకాంత్‌ను నియమించారని దుయ్యబట్టారు.



శ్రీకాంత్‌కు గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఉన్నపుడు నరహంతకుడుగా మారి సోంపేట, కాకరాపల్లి రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఉందని తమ్మినేని నిప్పులు చెరిగారు. యాజమాన్యాలిచ్చిన లంచాలకు అమ్ముడుబోయి రైతుల్ని కాల్పించింది శ్రీకాంతేనని, ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఆనాటి రక్తపు మరకలు ఆరలేదని అన్నారు.



‘‘ఇలాంటి వ్యక్తిని రాజధాని ప్రాంతానికి కమిషనర్‌గా వేస్తారా? చంద్రబాబూ... అఖిలభారత స్థాయిలోనే నంబర్‌వన్ అవినీతిపరుడైన అధికారిగా శ్రీకాంత్ గణుతికెక్కిన విషయం మీకు తెలియదా?’’ అని సూటిగా ప్రశ్నించారు. వచ్చే సీజన్ నుంచి పంటలు వేయవద్దని శ్రీకాంత్ శాసిస్తే.. తాము న్యాయస్థానాలకు వెళ్లి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాత ముత్తాతల నాటినుంచీ పొలాలతో తమ మనోభావాలు పెనవేసుకుని జీవిస్తున్న రైతులనుంచి బలవంత ంగా వాటిని లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. వారిపక్షాన పోరాడుతామన్నారు. తన కుమారుడిని ఇంకా కోటీశ్వరుడిని చేసి.. సీఎంగా చేయాలని తాపత్రయపడుతున్న చంద్రబాబుకు తన సొంత సంస్థ హెరిటేజ్‌ను ఇవ్వమంటే ఎంత బాధ కలుగుతుందో.. రైతులకూ అంతేకదా అని ఆయన అన్నారు.



ప్రజాపక్షాన పోరాటానికే జగన్ దీక్ష

టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయి పోరాటాలకు సిద్ధమవుతున్న ప్రజల తరఫున ప్రశ్నించేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు నిరాహారదీక్ష చేస్తున్నారని సీతారాం వివరించారు. జగన్ చేయబోయే ఈ దీక్ష ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పడుతుందని అంటూ.. ‘తణుకు సభతో టీడీపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోంది’ అని అన్నారు. జగన్ దీక్షకు రాష్ట్ర ప్రజలంతా మద్దతునివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top