సొంతింటి జీవనం.. రాజన్నతో సాకారం


 మహానేత హయాంలో 3.29 లక్షల గృహ నిర్మాణాలు రూ. 990 కోట్ల వ్యయం

 బాబు పాలనలో ఏటా 500 గృహాలకు మించనివైనం

 

 కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : పూరిగుడిసెల్లో ఇబ్బందులు పడ్డ కుటుంబలు.. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్న నిరుపేదల సొంతింటి కలను మహానేత వైఎస్సార్ సాకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను గుడిసెలేని రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యంతో 2004 ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా 2005-06లో ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టారు.

 

 తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో గూటి వసతికి నోచుకోని లక్షలాది మందికి ఆశ్రయం కల్పించారు. జిల్లాకు సంబంధించి మొదటి మూడు విడతల్లో రూ.990,30,92,576 వ్యయంతో 3,29,567 ఇళ్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యవైఖరి కారణంగా ఇందులో వేలాది నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఫలితంగా జిల్లాలో గృహ నిర్మాణ పథకం ఆటుపోట్ల మధ్య అపసోపాలు పడుతోంది.

 

 వైఎస్ మరణం తర్వాత తారుమారు..

 

 వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇంటి నిర్మాణం ప్రారంభమై పూర్తయ్యేలోగా దశల వారీగా బిల్లుల చెల్లింపులు జరిగేవి. పునాదులు పడగానే మొదటి బిల్లు చేతికి వచ్చేది. ఆయన మరణం తర్వాత పరిస్థితి తారుమారైంది. హైదరాబాదులోని ఎండీ కార్యాలయం నుంచే అనుమతి లభించేలా చేసినా బిల్లుల మంజూరులో జాప్యం తప్పడం లేదు. ప్రస్తుతం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు సిమెంటు, ఐరన్ తదితర సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో ఆ మేరకు వ్యయం కూడా పెరిగి లబ్ధిదారులు మధ్యలోనే నిలిపేసిన సందర్భాలున్నాయి.

 

 చంద్రబాబు పాలనలో ఏడాదికి 500 ఇళ్లే దిక్కు..

 

 చంద్రబాబు తన పాలనలో గృహ నిర్మాణాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎక్కడ చూసినా గుడిసెలే కనిపించేవి. అప్పట్లో ఒక్కో నియోజకవర్గానికి 500 నుంచి 1000 గృహాలను మాత్రమే మంజూరు చేసేవారు. వీటిలో అధిక శాతం తెలుగు తమ్ముళ్లకు చెందిన వారికే దక్కేవి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసులుంటే తప్ప గృహం మంజూరు కాని పరిస్థితి ఉండడంతో ఇంటి నిర్మాణం అంటే పేదవారు భయపడేవారు.

 

 కిరణ్ పాలనలోనూ అంతంతే


 

 మహానేత మరణం తర్వాత వచ్చిన రోషయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి తూతూమంత్రంగా రచ్చబండ ద్వారా లక్షల సంఖ్యలో అర్జీలు స్వీకరించినా అధికశాతం మందికి మొండి చెయ్యి చూపించారు. కిరణ్ హయంలో మూడు విడతలుగా రచ్చబండ జరిగితే మంజూరైంది 90 వేల గృహాలు మాత్రమే. వీటిలో కూడా అధికారిక అనుమతి లభించాల్సినవి వేలల్లోనే ఉన్నాయి. బిల్లుల చెల్లింపులకు అనేక నిబంధనలు విధించడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. దీనికితోడు సిమెంటు సహా గృహ నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు.  

 

 సొంతింటి కల నెరవేర్చారు


 ఆటో తప్ప వేరే ఆధారం లేని నేను కుటుంబంతో సహా కూలేందుకు సిద్ధంగా ఉన్న మట్టి మిద్దెలో ఉంటిమి. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత గృహం మంజూరైంది. ఆయన దయ వల్ల ఇల్లు కట్టుకున్నాం.

     - ఎర్రన్న, సీ బెళగల్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top