అందులోనూ 'నారాయణ' ఫస్ట్‌: రోజా

అందులోనూ 'నారాయణ' ఫస్ట్‌: రోజా - Sakshi


అమరావతి :  ప్రతి సంవత్సరం ఫస్ట్‌ ర్యాంక్‌..సెకండ్‌ ర్యాంక్‌.. థర్డ్‌ ర్యాంకు అంటూ ప్రకటనలిచ్చి గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రశ్నప్రతాల లీకులు వంటి అక్రమాల ర్యాంకుల్లోను ఆ సంస్థ ప్రథమ స్థానంలో ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రంలో మూడేళ్లుగా ముఖ్యమంత్రి అసమర్థపాలన, మంత్రుల దద్దమ్మల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. 


ముఖ్యమంత్రి ....ఏ మాత్రం రాజకీయ అవగాహనలేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చి పాలన మొత్తం ఆయన చేతిలో పెట్టారన్నారు. వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, నారాయణలు ఇద్దరూ కలిసి రాష్ట్రంలోని విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని రోజా మండిపడ్డారు. ఇద్దరు వియ్యంకులు కలిసి విద్యా వ్యాపారం కోసం అనేక అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని విమర్శించారు.



ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు, మంత్రి నారాయణ జిల్లా నెల్లూరు, గంటా శ్రీనివాసరావు ఇన్‌చార్జ్‌గా ఉన్న వైఎస్‌ఆర్‌ కడప, ఆయన జిల్లా విశాఖలోను టెన్త్‌ పేపర్‌లు లీకు అయ్యాయని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నారాయణ విద్యా సంస్థల ర్యాంకుల కోసం  రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుని, వారి జీవితాలను నాశనం చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. విద్యాలయాల్లో జరుగుతున్న ఘటనలపై మంత్రి గంటా ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.



రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని మంత్రి గంటా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లారని, మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆయన అమెరికాలో పర్యటిస్తారని, ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల్లో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకు అయితే  ఆస్తుల కేసు నుంచి బయటపడేందుకు పెద్దలను ప్రాధేయపడే పనిలో బిజీగా ఉన్నారని రోజా దుయ్యబట్టారు.


మంత్రులుగా వాళ్లిద్దరూ ఎన్నిరోజులు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారో వెల్లడించాలన్నారు. నిజంగా గంటాకు  సిగ్గు శరం ఉంటే నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఇద్దరు మంత్రులు నారాయణ, గంటాలను బర్తరఫ్‌ చేసి, నారాయణ విద్యా సంస్థల్లో పేపర్‌ లీకేజిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. అలా చేయలేకపోతే సీఎం స్వచ్చందంగా రాజీనామా చేయాలని హితవు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top