‘స్విస్ చాలెంజ్’ను అడ్డుకోండి


ప్రధాని మోదీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి



 సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చే స్తున్న ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. జనం సొమ్మును దోచుకోవడానికే స్విస్ చాలెంజ్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ద్రోహం తలపెడుతున్నారని మండిపడ్డారు. ఇది దేశ ద్రోహం కూడా అని ధ్వజమెత్తారు. రోజా మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్విస్ చాలెంజ్ వ్యవహారంలో చంద్రబాబును ప్రోత్సహిస్తే ప్రజలు బీజేపీని క్షమించరని ఆమె చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో త్వరలో తాము ఢిల్లీకి వెళ్లి, స్విస్ చాలెంజ్ విధానాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీని కోరుతామన్నారు.



 పుట్టబోయే పిల్లలనూ దోచుకుంటారు

 సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని రోజా పేర్కొన్నారు. ఇక్కడి భూమిని 25 ఏళ్లపాటు సింగపూర్ వాళ్లకు అప్పగించడం ఇక పుట్టబోయే పిల్లలను కూడా దోచుకునే విధంగా ఉందన్నారు. పెత్తనం అంతా సింగపూర్ కంపెనీలకే అప్పగించారని, నష్టం వస్తే మాత్రం ఏపీ ప్రభుత్వం భరించేలా క్లాజులను రూపొందించారని విమర్శించారు. అమరావతిలో నిర్మించే రాజధాని ప్రజల కోసమా? లేక సింగపూర్ కంపెనీల కోసమా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కేవలం చంద్రబాబు, ఆయన కుమారుడి బినామీలు బిట్లు బిట్లుగా రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. స్విస్ విధానం మంచిది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. మన దేశంలోని ఐఐటీలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివే వారు ఎందుకూ పనికిరారని చంద్రబాబు భావించడం దారుణమన్నారు. తన కుమారుడు లోకేశ్‌బాబు దద్దమ్మ అయితే అందరూ అలాగే ఉంటారని చంద్రబాబు భావించడం తగదన్నారు.



 ఏం జరిగినా నో పోలీస్: బాలకృష్ణ సినిమాలో ‘నో పోలీస్’ అంటూ చెప్పిన డైలాగ్ రాష్ట్రంలో పాలనకు అద్దం పడుతోందని రోజా అన్నారు. ‘‘గోదావరి పుష్కరాల్లో బాబు పబ్లిసిటీ పిచ్చికి 29 మంది బలైతే నోపోలీస్. ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలైతే నో పోలీస్. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ జరిగితే నో పోలీస్. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాత్ర ఉన్నా నో పోలీస్. తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం చేసినా నో పోలీస్’’ అని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top