హామీల అమలులో బాబు విఫలం

హామీల అమలులో బాబు విఫలం - Sakshi


నమ్మించి మోసం చేయడం ఆయన నైజం

టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి

ఐదేళ్లు కొనసాగడం అనుమానమే




మతుకువారిపల్లె(కల్లూరు): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబునాయుడు విఫలమయ్యారని పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. నమ్మించి మోసం చేయడం బాబు నైజమని, అందుకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారని అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పెద్దిరెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబునాయుడు అమలు సాధ్యం కానీ హామీలను గుప్పించాడని, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించి ప్రజలను నట్టేట ముంచారని అన్నారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరన్న నిజం మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచేశారన్నారు. ఇప్పటికే ప్రజలు టీడీపీ పాలనపై విసుగు చెందారని, ఐదేళ్లు కొనసాగడం కూడా కష్టమేనని అన్నారు. చంద్రబాబునాయుడుపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు.



వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చల్లావారిపల్లెలో పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాను చేత పట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు పోకల అశోక్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు అశోక్, పార్టీ మండలాధ్యక్షుడు మురళీమోహన్‌రెడ్డి, అటవీ శాఖ మాజీ డెరైక్టర్ వల్లివేడు రాజారెడ్డి(పృధ్వీరెడ్డి), సర్పంచ్‌లు ఉషారాణి, ఎర్రమ్మ, షబానా, వెంకట్రమణ, వెంకటాచలం, ఎంపీటీసీలు నటరాజ, శ్రీనివాసులు, ముంతాజ్, సురేఖ పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top