శిశువు మరణం ప్రభుత్వ అసమర్థతే..

శిశువు మరణం ప్రభుత్వ అసమర్థతే.. - Sakshi


వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం

 

 పట్నంబజారు (గుంటూరు) : ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతి రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నా, నైతిక బాధ్యత వహించాల్సిన మంత్రులు పరామర్శలకు రావడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లో పసికందు మృతిపై వైఎస్సార్ సీపీ నేతలు భగ్గుమన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు రాజీనామా చేయాలని, జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను తక్షణమే సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలో బైఠాయించారు. మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ నెలకు రెండుసార్లు గుంటూరులో పర్యటిస్తున్న ఆరోగ్య మంత్రి చేస్తోంది ఏమిటని ప్రశ్నించారు.



కామినేని అసమర్థ్ధత వలనే ఇటువంటి దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. ఎస్సీసెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు దాసోహమై ప్రభుత్వ వైద్యశాలలను నిర్వీర్యం చేస్తున్నారని, ఇదీ కేవలం గుంటూరులో జరుగుతున్న తంతు కాదని మండిపడ్డారు. 20 సార్లు జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక్కసారైనా జీజీహెచ్‌ను పరిశీలించకపోవటం దారుణమని, తక్షణమే విచారణ జరిపించి బాధ్యలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.



నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ సిబ్బందిని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా మాట్లాడుతూ ఆసుపత్రిలో పారిశుధ్ధ్యం సరిగా లేకపోవటంతో నెలరోజులపాటు తన సొంత డబ్బులతో కార్మికులును పెట్టి పనులు చేయించటం జరిగిందన్నారు.  శిశువు తల్లితండ్రులు చావలి నాగ, లక్ష్మీలను విజయవాడ నుంచి తన వెంట తీసుకుని వచ్చిన పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆసుపత్రిలో మంత్రుల బృందాన్ని నిలదీశారు. పసికందు తల్లితండ్రులకు పూర్తి న్యాయం చేయాలని ఉద్వేగభరితంగా తన వాదననూ వారికి వినిపించించారు.



రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్‌లు బాధిత కుంటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళుతున్న క్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. మంత్రి కామినేని రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు నేతల మధ్య తోపులాట జరగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్‌అహ్మద్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పలు విభాగాల నేతలు కావటి మనోహర్‌నాయుడు, మొగిలి మధు, కోవూరి సునీల్‌కుమార్, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, అంగడి శ్రీనివాసరావు, షేక్ గులాంరసూల్, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, గనిక ఝాన్సీరాణి, పల్లపు రాఘవ, శిఖా బెనర్జీ, కొట్టె కవిత, కొలకలూరి కోటేశ్వరరావు, కాశీవిశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top