తప్పుడు వాగ్దానాలిస్తే తరిమికొట్టాలి


జనం గొంతుకైన జగన్ జనం మనిషి  

దీక్షా వేదికపై నేతల ప్రసంగాలు




తణుకు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కష్టాలు చెప్పుకోలేని జనానికి గొంతుకై నినదిస్తూ.. తమ సమస్యల పరిష్కారం కోసం పాలకులను నిలదీయలేని జనానికి పిడికిలై నిగ్గదీస్తూ..  జనం మధ్యే ఉంటూ.. వారి కోసమే ఉద్యమిస్తూ.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జనం మనిషిగా చెరగని ముద్ర వేసుకున్నారని నేతలు కొనియాడారు. ప్రజల కోసం పరితపించిన దివంతగ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో యువనేత జగన్‌మోహన్‌రెడ్డి మొక్కవోని దీక్షాదక్షతలతో సాగిస్తున్న పోరాటాలకు బాసటగా ఉంటామంటూ రైతు దీక్ష వేదికపై నేతలు ప్రకటించారు.  



ఎన్నికల హామీల అమలుకై చట్టం తేవాలి...

చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలను నిలదీస్తూ జగన్ దీక్ష చేశారనీ ,ఎన్నికల హామీల అమలుకు చట్టం తేవాలని కోరుతూ తాను ఇటీవల పార్లమెంటులో ప్రస్తావిస్తే కేంద్రమంత్రి సదానంద గౌడ ఆ యోచన ఉందని బదులిచ్చారనీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన ప్రసంగంలో వెల్లడించారు. ఎంపీ వర ప్రసాదరావు మాట్లాడుతూ  రాజధాని నిర్మాణానికి ఇక్కడ నిపుణులు లేరా అని ప్రశ్నించారు.



ప్రజా నిరసన కనిపించడంలేదా?

వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబికుతున్న నిరసన చంద్రబాబు కళ్లకు కనిపించడంలేదని ఘాటుగా విమర్శించారు.   మరో ఉపనేత ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.



ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయని బాబు ప్రపంచ స్థాయి రాజధాని పేరిట రైతుల భూములు కాజేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ బాబు దుష్టపాలనకు యువత చరమగీతం పాడాలన్నారు. ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రుణమాఫీ పై  తప్పుడు లెక్కలు చెప్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాబు ఒక సారి తమ మేనిఫెస్టోను చదువుకోవాలన్నారు.



ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ఏడాదికి మూడు పంటలు పండించే తుళ్లూరు భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గారడీ విద్యలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి చంద్రబాబు వచ్చారని ఎమ్మెల్యే కిలారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. బాబు ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు. ఎమ్మెల్యేలు పాముల శ్రీవాణి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోన రఘుపతిలు మాట్లాడుతూ జగన్ సాగిస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతునివ్వాలని కోరారు.



గళమెత్తిన నేతలు

బాబు పాలనను అంతం చేయాలని మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ కోరారు. ప్రజల పక్షాన జగన్ నినదించిన తీరు రాజకీయాలకే గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు అన్నారు. ప్రజల పక్షాన తమ పార్టీ నిరంతర పోరాటం సాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఎం.ప్రసాదరాజు అన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి, వాసిరెడ్డి పద్మలు మాట్లాడుతూ  బాబు సమావేశం పెడితే రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. స్మార్ట్ అంటూ ప్రజలను మోసగిస్తున్నారని తమ్మినేని సీతారాం అన్నారు. బాబు అభివృద్ధి నిరోధకుడని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రైతులకు అండగా తమనేత జగన్ దీక్ష చేశారన్నారు.  వైఎస్సార్‌సీపీ నేతలు  సామాన్య కిరణ్, సలాంబాబు ప్రసంగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top