గరం.. గరం.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

గరం.. గరం.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - Sakshi


ప్రొద్దుటూరు టౌన్:  ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. అధికారపక్ష సభ్యుల తీరుపై వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్‌రెడ్డికి ఛెర్మైన్ పక్కన సీటు కేటాయించకుండా అవమానించారంటూ సభలో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.



మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉండేల గురివిరెడ్డి అధ్యక్షతన సోమవారం మున్సిపల్ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛెర్మైన్ పక్కన ఎమ్మెల్యేకు సీటు కేటాయించకపోవడంతో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్‌ను ప్రశ్నించారు.



ప్రజలచేత శాసనసభ్యునిగా ఎన్నికైన నన్ను అవమానించడం తగదు. నా హక్కును కాపా డుకోవాలనుకుంటున్నా తప్ప అభివృద్ధికి నేను, మా కౌన్సిలర్లు అడ్డుపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి ఛైర్మన్ గురివిరెడ్డి, కమిషనర్ వెంకటకృష్ణలను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష నేత వీఎస్ ముక్తియార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకి గత 30 ఏళ్లుగా ఛైర్మన్ పక్కనే సీటు వేస్తున్నారని ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని పాటించాలని సూ చించారు. ఇందుకు చైర్మన్ స్పందిస్తూ నిబంధనలు అలా లేవని ఏదైనా రూల్ పొజిషన్ ఉంటే దాని ప్రకారమే చేస్తామన్నారు. దీనిపై ఎమ్మెల్యే  మెమో నెంబర్ 30995-ఈఎల్‌ఈసీ.ఐ-95 ఎం.ఏ తేదీ 25-10-1995లో జారీ చేసిన ప్రభుత్వ ఆర్డర్‌ను చూపించారు.

 

దీంతో వెంటనే చైర్మన్ మాట మా ర్చారు. వచ్చే కౌన్సిల్ సమావేశానికి దీన్ని పరిశీలిం చి అప్పుడు తానే కుర్చీ వేసి ఎమ్మెల్యేని ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రతిపక్ష నేత ముక్తియార్, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఒప్పుకోలేదు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడంతో కమిషనర్ జోక్యం చేసుకుని 1995లో ఇచ్చిన ఆర్డర్‌లో చైర్మన్ పక్కన ఎమ్మెల్యే, ఎంపీలు కూర్చోవచ్చని ఉందని, దీని తర్వాత ఏ ఆర్డర్ వచ్చిందో తనకు తెలియదన్నారు.



దాని తర్వాత ఏ ఆర్డర్ రాలేదని, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఎంత చెప్పినా కమిషనర్ స్పందించలేదు. దీంతో ప్రతిపక్ష నేత ముక్తియార్‌తోపాటు ఆ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం ముందు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్ పది నిమిషాలపాటు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

మళ్లీ అదే సీన్

తిరిగి సమావేశం ప్రారంభం కాగానే అజెండాను చదవాలని సీసీని ఛైర్మన్ ఆదేశించడంతో  చైర్మన్ పక్కన ఎమ్మెల్యే కూర్చొనే ప్రభుత్వ ఆర్డర్‌పై స్పష్టత ఇవ్వకుండా ఎలా అజెండా చదివిస్తారని ముక్తియార్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు రామదాసు, మురళీధర్‌రెడ్డి, మరికొందరు చైర్మన్ పక్కన ఎమ్మెల్యేకు కుర్చీ వేసేందుకు ప్రయత్నించడంతో కౌన్సిల్ హాల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ కౌన్సిలర్లు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని అందరికి సర్దిచెప్పారు.

 

కమిషనర్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే

తాను ఇచ్చిన ప్రభుత్వ ఆర్డర్‌పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కమిషనర్‌ను ప్రశ్నించినా కమిషనర్ మౌనం వీడలేదు. తన హక్కులకు భంగం కలిగిస్తే స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే చెప్పినా కూడా స్పందన లేదు. ఒకానొక దశలో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష నేతతోపాటు కౌన్సిలర్లను బయటికి పంపాలని చైర్మన్ డీఎస్పీకి సూచించారు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు లోపలికి వచ్చే హక్కే లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.

 

కౌన్సిల్ సమావేశంలో అజెండా పై చర్చ జరగకపోయినా  చైర్మన్ ఈ అజెండాను ఆమోదించినట్లు ప్రకటించి వెళ్లిపోయారు. టీడీపీ కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ హాల్ నుంచి వెళ్లిపోవడంతో ైవైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కౌన్సిల్ హాల్‌లో అలాగే కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత చైర్మన్ సీసీ సమావేశ భవనానికి వచ్చి 7, 28, 29, 30, 31 అంశాలను రద్దు చేస్తూ మిగిలిన అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారని చెప్పడంతో అజెండానే చదవకుండా ప్రతిపక్ష సభ్యులతో చర్చించకుండా ఎలా ఆమోదం తెలుపుతారని ఎమ్మెలే, ప్రతిపక్ష నేత ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top