మాటలతో బాబు కాలయాపన


హైదరాబాద్: ఏడాది కాలంగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగట్టి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒత్తిడి చేయడానికే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సమర దీక్ష నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు మంగళగిరిలో తలపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్షకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలు శుక్రవారంనాడిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.



పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, ఘట్టమనేని శేషగిరిరావు, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, గుడివాడ అమరనాథ్, చల్లా మదుసూధన్‌రెడ్డి తదితరులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీక్షను పురస్కరించుకుని పార్టీ రూపొందించిన ప్రచార వీడియో చిత్రాన్ని ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు  ఏడాది పాలన ఆర్భాటాలు, ప్రచారమే తప్ప ప్రజలకు జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదని విమర్శించారు.







రోజుకో విధంగా మాయమాటలతో చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతు వ్యవస్థనే ఛిన్నాభిన్నంగా చేసేలా రైతు రుణమాఫీ హామీ విషయంలో వ్యవహరించారని తూర్పారపట్టారు. డ్వాక్రా రుణమాఫీ విషయంలో ఏడాది కాలంలో మహిళల ఆర్థిక మూలాలను పూర్తిగా నాశనం చేశారని చెప్పారు. రాజధాని పేరు చెప్పి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని, విదేశీ కంపెనీలకు అప్పగించి రియల్‌ఎస్టేట్ వ్యాపారం నడపబోతున్నారన్నారు.



నేడు పులివెందులకు వైఎస్ జగన్

పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. జగన్ శనివారం ఉదయం 8.30 గంటలకు తన తాత రాజారెడ్డి ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పిస్తారని చెప్పారు. అనంతరం స్థానికంగా కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఆదివారం వేముల, లింగాల మండలాల్లో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతుల కుటుంబసభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. 25న క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top