'బొజ్జల గోపాలకృష్ణారెడ్డిదే ఐరన్ లెగ్ '

'బొజ్జల గోపాలకృష్ణారెడ్డిదే ఐరన్ లెగ్ ' - Sakshi


తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం డోర్ డెలివరీ ఏజెంట్లుగా మారిపోయారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఎవరైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ కార్యకర్తలు బెల్టు షాపుల్లోంచి తీసుకెళ్లి మరీ ఇస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆమె గురువారం మాట్లాడారు. మధ్యలో టీడీపీ సభ్యులు, మంత్రులు పదే పదే కలగజేసుకుని ఆమెకు అంతరాయాలు కలిగించగా దీటుగా సమాధానాలు ఇచ్చారు. 'నా నోటికి అసలే మంచిమాటలు రావు. నేను మాట్లాడేది జాగ్రత్తగా వినండి' అని గట్టిగా చురక అంటించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రోజాను 'ఐరన్ లెగ్' అని వ్యాఖ్యానించారు. దాంతో ఐరన్ లెగ్ తనది కాదని, గోపాలకృష్ణారెడ్డిదేనని ఆమె అన్నారు. చంద్రబాబు మీద బాంబుదాడి జరిగినప్పుడు ఆ కారులో ఆయనే ఉన్నారని, అలాగే వైఎస్ మరణానికి ముందు రోజు కూడా క్యాంపు కార్యాలయంలో బొకేతో వెళ్లినది ఆయనేనని మండిపడ్డారు.



అంతకుముందు రోజా సభలో మాట్లాడుతూ... ''టీడీపీ కార్యకర్తలు మద్యం డోర్ డెలివరీ ఏజెంట్లుగా అయిపోయారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మద్యాన్ని ఇళ్లకు తీసుకెళ్లి మరీ ఇచ్చేంత స్థాయికి దిగిపోయారు. ఇది మహిళా సంక్షోభ ప్రభుత్వమని మొదటి బడ్జెట్లోనే తెలిసిపోయింది. స్వయం సహాయక గ్రూపులు, డ్వాక్రా గ్రూపుల రుణాలను అణాపైసలతో సహా తీసేస్తామన్నారు. ఇప్పుడు కుంటిసాకులు చూపించి, బడ్జెట్లో డ్వాక్రా సంఘాల బలోపేతానికి లక్ష రూపాయలు ఇస్తామన్నారే తప్ప రుణాల గురించి చెప్పలేదు. రుణమాఫీ చేయాల్సిందేనని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలంలో మహిళలు ఐకేపీ అధికారుల మీద తిరగబడ్డారు. రుణాలు మాఫీ చేయాల్సిందేనని, తాము కట్టేది లేదని అంటున్నారు. డ్వాక్రా సంఘాలు తమ గొప్పేనంటున్నారు.. గతంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. మహిళలకు గోరంత సాయం చేస్తే వాళ్లు కొండంత ఎదుగుతారని తెలుసుకోవాలి.



గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పి , ఆ తర్వాత ఇల్లరికపు అల్లుడిగా మారి అదే పార్టీని తన చంకలో పెట్టుకుని వెళ్లిపోయారు. అలాంటి పార్టీకి చెందినవాళ్లు మమ్మల్ని వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు.



ఏ పార్టీలో ఉంటామన్నది ముఖ్యం కాదు.. మహిళల సంక్షేమం కోసం పోరాడతాం. ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా మహిళల కోసం పోరాడిన చరిత్ర నాకుందని చెబుతున్నా. అప్పు మాత్రమే మహిళలు చెల్లిస్తే సరిపోతుందని, వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఒక జీవో ఉంది. కానీ, ఈ ప్రభుత్వం వచ్చాక వడ్డీ కూడా కట్టాలంటూ సర్క్యులర్లు జారీచేశారు. ఇది మహిళలను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నా. అంగన్వాడీ, ఆశా వర్కర్లు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. తమకు వేతనాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించి, లాఠీ ఛార్జీ చేసిన ఘనత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది. వైఎస్ హయాంలో రెండుసార్లు వేతనాలు పెంచారు. కేంద్రం ఇచ్చే వేతనాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వేతనాలిచ్చారు'' అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top