‘దందాలకు కేరాఫ్ అడ్రస్ ఆ మంత్రి’

‘దందాలకు  కేరాఫ్ అడ్రస్ ఆ మంత్రి’ - Sakshi


కోటబొమ్మాళి: రాష్ట్రంలో ఏ దందా జరిగినా రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన పాత్ర వహిస్తూ దందాలకు కేరాఫ్‌గా మారారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ విమర్శించారు. శుక్రవారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చేసే దందాలు రోజురోజుకు మీడియాద్వారా బహిర్గతం అవుతున్నాయని ఆరోపించారు. అమరావతిలో ఉన్న భూములు వ్యవహారంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లకు ముడుపులు కట్టబెట్టడం వల్ల కేబినెట్‌లో బి–గ్రేడ్‌ మంత్రిగా దిగజారిన అచ్చెన్నాయుడుకు మంత్రి వర్గంలో ప్రమోషన్ కల్పించారని దుయ్యబట్టారు.


ఇసుక, లిక్కర్‌ దందాలతోపాటు నయీమ్‌తో వ్యవహారాలు నడపడం ద్వారా అన్ని అక్రమదారుల్లో ప్రధాన భూమిక పోషించారని ధ్వజమెత్తారు. టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులకు గతంలో నైతిక విలువలు ఉండేవని.. ప్రజల పక్షాన సమస్యలపై పోరాడేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న  అచ్చెన్నాయుడు దందాలు, కబ్జాలు, లిక్కర్‌ మాఫియాకు, నయీమ్‌ వంటి దుర్మార్గులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ఎద్దేవా చేశారు.



మంత్రిగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి్సన అచ్చెన్న.. అవినీతికి అడ్డాగా మారారని విమర్శించారు.  ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఎస్‌.హేమసుందరరాజు, పార్టీ నాయకులు పేడాడ వెంకటరావు, దుబ్బ సింహాచలం, కాళ్ల గణపతి, ఎస్‌.వినోద్, ఎం.భాస్కరరెడ్డి, జి.సూర్యప్రకాశ్, మూల అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top