కాపుల గొంతు కోసింది చంద్రబాబే..: జోగి రమేష్‌

కాపుల గొంతు కోసింది చంద్రబాబే..: జోగి రమేష్‌ - Sakshi


సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల ఉప​ఎన్నకల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాపుల గొంతుకోసింది చంద్రబాబేనని మండిపడ్డారు. ఈవిషయం తాము చెప్పింది కాదని తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమానే స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. విజయవాడలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని  చెప్పిన బాబు ఇప్పుడు మంజునాథ కమిటీ నివేదిక రావాలంటూ ఇచ్చిన మాటను దాటవేస్తున్నారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లకోసం శాంతియుతంగా పాదయాత్ర చేపట్టిన ముద్రగడ పద్మనాభంను అడ్డకుంటున్నారని, ఆయన ఇంటిని జైలుగా మార్చి వేధిస్తున్నారని మండిపడ్డారు. కాపులను వేధించే తెలుగుదేశం పార్టీకి కాపులు, బలిజలు ఓట్లు వేయద్దని కోరారు.



పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, చెప్పులు, కర్రలతో ఎన్టీఆర్‌పై దాడిచేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు. అవనిగడ్డ, నందిగామ, తిరుపతి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు చనిపోతే ఉపఎన్నికల్లో ఏకగ్రీవానికి వైఎస్సార్సీపీ సహకరించిందని అలాంటిది ఇప్పుడు నంద్యాలలో వైఎస్సార్సీపీపై పోటీ ఎలా పెడతారు అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి హోల్‌సేల్‌గా అబద్ధాలు ఆడే చంద్రబాబును నంద్యాల ప్రజలు ఓటుద్వారా తరిమి కొడతారని జోగిరమేష్‌ అన్నారు.



దేశంలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన విమర్శించారు. వైఎస్‌ తన హాయాంలో మైనార్టీలకు మంత్రి పదవుల్లో పెద్ద పీటవేశారన్నారు. ముస్లిం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిది అని గుర్తుచేశారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో బీజేపీతో పొత్తుపెట్టుకొని జెండాలు చేకుండా ప్రచారం చేయాలంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.  మైనార్టీల సంక్షేమంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబుకు ఉన్న తేడాలను మైనార్టీ సోదరులు గుర్తించాలని జోగి రమేష్‌ కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top