అవినీతి పాలనను అంతమొందించండి

అవినీతి పాలనను అంతమొందించండి - Sakshi

- వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స 

నంద్యాల, కాకినాడల్లో టీడీపీని తరిమికొట్టండి

 

కాకినాడ: ప్రజలకిచ్చిన హామీలను తుంగలోకి తొక్కి, అవినీతిలో కూరుకుపోయిన మూడున్నరేళ్ళ తెలుగుదేశం పాలనకు రానున్న నంద్యాల, కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎస్వీఎన్‌ ఫంక్షన్‌ హాలులో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నంద్యాల తరహాలో మోసాలు, ప్రలోభాలు కాకినాడలో కూడా ప్రారంభించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.



ఓటర్ల వద్దకు వెళ్ళి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేస్తామంటూ అకౌంట్‌ నెంబర్లు తీసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా చేసిన అభివృద్ధిని చూపించి ఓటు వేయమని అడుగుతుందని, కానీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు రద్దు చేస్తామని బెదిరింపు ధోరణికి దిగుతున్నారని మండిపడ్డారు. 

 

ఒక్క హామీ అమలయ్యిందా?

స్మార్ట్‌ సిటీ, పెట్రో యూనివర్సిటీ, ఎల్‌అండ్‌టీ టెర్మినల్, తుని నౌకా నిర్మాణ కేంద్రం, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరిపీచు పరిశ్రమ, ఆక్వాఫుడ్‌ పార్కు సహా ఇచ్చిన ఏ ఒక్క హమీ అయినా అమలయ్యిందా? అని బొత్స నిలదీశారు. రూ.400 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా పట్టుమని రూ.5 కోట్ల పనులు కూడా పూర్తి చేయలేకపోయారని చెప్పారు. అవినీతి దాహంతో కేంద్ర నిధులను కూడా కైంకర్యం చేయాలన్న చంద్రబాబు, లోకేష్, స్థానిక నేతల తీరు ఈ ప్రాంతం అభివృద్ధికి అవరోధంగా మారిందని చెప్పారు. విశాఖలో వేల కోట్ల విలువైన భూములను దోచేసిన చంద్రబాబు, ఆయన అనుయాయుల కన్ను ఇప్పుడు కాకినాడ తీరంపై పడిందని ధ్వజమెత్తారు.



కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల ముందు ఊరువాడా ప్రచారంచేసిన టీడీపీ ఇప్పుడు ముద్రగడ ఉద్యమాన్ని అణిచివేస్తూ కాపుజాతిని అవమానిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక స్మార్ట్‌సిటీ కన్నా భిన్నంగా రాష్ట్రంలోనే కాకినాడను ప్రత్యేక స్థానంలో నిలిపేలా కృషి చేస్తామన్నారు. కాకినాడ 34వ డివిజన్‌ కార్పొరేట్‌ అభ్యర్థి పసుపులేటి వెంకటలక్ష్మికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పినిపే విశ్వరూప్, కొప్పన మోహనరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top