వీధి రౌడీలా మాట్లాడుతున్నారు

వీధి రౌడీలా మాట్లాడుతున్నారు - Sakshi


జగన్‌పై మంత్రి దేవినేని వ్యాఖ్యల పట్ల బొత్స ఆగ్రహం

మీరిచ్చిన హామీలేమయ్యాయో చెప్పండని నిలదీత


 

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నోటికొచ్చినట్లు మాట్లాడ్డం అభ్యంతరకరమని, ఒక మంత్రిలా కాకుండా వీధిరౌడీలా మాట్లాడడం గర్హనీయమని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వెలిబుచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ప్రజాసమస్యలపై మచిలీపట్నం, విజయవాడలో జగన్ చేసిన రెండు ధర్నాలు విజయవంతమవడంతో ఓర్వలేని మంత్రి నిస్పృహతో, అసహనంతో ఇలాంటి భాష వాడారన్నారు. ‘‘ఏయ్, నీ తాటతీస్తా... అనే పదజాలాన్ని మంత్రి వాడడమేమిటి? ఎవరి తాట తీస్తారు మీరు? మీకు నిజంగా ధైర్యముంటే ఇవేమాటలు ప్రజల్లోకి వె ళ్లి అనండి.. మీరిచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పండి. రైతులు, మహిళల రుణాలమాఫీపై చేసిన హామీలేమయ్యాయో వివరించండి.



ప్రత్యేకహోదా తెస్తామని వంచించి ఓట్లేయించుకుని ఇపుడు చేస్తున్న మోసం గురించి చెప్పండి.. అపుడు ప్రజలే మీ బట్టలూడదీస్తారు’’ అని హెచ్చరించారు. మంత్రులు మాట్లాడేటపుడు సభ్యత, సంస్కారంతో వ్యవహరించాలని బొత్స హితవు పలికారు. పోలవరం నిర్మాణానికి జగన్ అడ్డుపడుతున్నారనే సమాచారం తమవద్ద ఉన్నట్టుగా మంత్రి చెప్పారని, నిజంగా ఉంటే దాన్ని బయటపెట్టాలని బొత్స సవాలు విసిరారు. పోలవరం విషయంలో రాష్ట్రప్రభుత్వం చొరవ చూపట్లేదని పోలవరం అథారిటీ అధికారి కొద్ది రోజులక్రితం చెప్పినమాట నిజం కాదా? అని ప్రశ్నించారు. గడ్డి తింటున్నారా అని ప్రశ్నిస్తున్న మంత్రి తానే స్వయంగా గడ్డి తింటున్నట్లుగా ఉందని, అన్నం తినేవారైతే ఇలాంటి అపవాదులు వేయరని బొత్స దుయ్యబట్టారు. 420 అని మంత్రి నిందిస్తున్నారని, వాస్తవానికి ఇచ్చిన హామీల్ని అమలు చేయని సీఎం, మంత్రులపైనే 420 కాదు, 840 కేసు పెట్టాలన్నారు.



 రాజద్రోహానికి పాల్పడే నైజం బాబుదే..

 రాజద్రోహానికి పాల్పడే నైజం చంద్రబాబుదేనని, ఎన్టీఆర్‌పై ద్రోహానికి పాల్పడి గద్దెదించిన ఘనత ఆయనదేనని బొత్స అన్నారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలనే యోచన జగన్‌కు లేదని, కానీ ప్రజాసమస్యలపై వారికి అండగా పోరాడటానికి ప్రతిపక్షంగా ఎపుడూ ముందుంటామని స్పష్టంచేశారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top