ఉత్తరాంధ్ర ఎంపీలూ తప్పుకోండి

ఉత్తరాంధ్ర ఎంపీలూ తప్పుకోండి - Sakshi


రైల్వే జోన్ సాధించడంలో  ఉత్తరాంధ్ర ఎంపీలు వైఫల్యం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మండిపాటు

జగదాంబ సెంటర్లో పార్టీ శ్రేణుల రాస్తారోకో

నాయకులు..కార్యకర్తలు అరెస్ట్

దిష్టి బొమ్మ దహనం చేయకుండా అడ్డుకున్న పోలీసులు

మహిళా కార్యకర్తలకు గాయాలు

 


అల్లిపురం: ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురాలేని ఉత్తరాంధ్ర ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. ైరె ల్వే బడ్జెట్‌ను నిరసిస్తూ పార్టీ గురువారం  మధ్యాహ్నం జగదాంబ జంక్షన్‌లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నానికే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీనికి నిరసనగా కేంద్రంలో మంత్రులుగా ఉన్న తెలుగుదేశం ఎంపీలు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజులు తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కంభంపాటి హరిబాబు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి రాజీనామా చేయాలని కోరారు. రైల్వే జోన్ సాధించేవరకూ వైఎస్సార్ సీపీ ఆందోళన పథం వీడదన్నారు. జగదాంబ కూడలిలో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు యల్లమ్మతోట పార్టీ కార్యాలయం నుండి జగదాంబ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమర్‌నాథ్ నేతృత్వంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు  రోడ్డుపై బైటాయించారు.



ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళా కార్యకర్తలు నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకువెళుతున్న పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా రోడ్డుపై కూర్చుని నిరసనను తెలియజేశారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయటంతో పరిస్థితి మరింత జఠిలమైంది. పోలీసులు మహిళా ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న సమయంలో జరిగిన పెనుగులాటలో మహిళా కార్యకర్తలు గాయపడ్డారు.ఈ  ఆందోళన కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కొయ్య ప్రసాద్‌రెడ్డి, తిప్పల నాగిరెడ్డి, పక్కి దివాకర్, కంపా హనోక్,విల్లూరి భాస్కరరావు, మహిళా నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ ,మాజీ కార్పొరేటర్ ఎండీ షరీఫ్ పాల్గొన్నారు.

 

 

పోలీసుల అత్యుత్సాహం



వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపించారు. దహనం చేసేందుకు తీసుకువస్తున్న  కేంద్రప్రభుత్వం దిష్టి బొమ్మలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాస్తారోకోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏసీపీ స్థాయి అధికారితో సహా రోప్ పార్టీలతో జగదాంబ కూడలికి చేరుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి మూడువ్యాన్లు, జీపులలో టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top