పేదలపై ఉమా ఉక్కుపాదం

పేదలపై ఉమా ఉక్కుపాదం - Sakshi


వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజం

500 మందితో బొమ్మసాని పార్టీలో చేరిక


 

గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం): అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను అణచివేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆరోపించారు. గుంటుపల్లిలో 25 ఏళ్లు డీడీపీకి సేవచేసిన బొమ్మసాని వెంకట చలపతి తన 500 మంది కార్యకర్తలతో వైఎస్సార్ సీపీలోకి చేరేందుకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షులు లంకే అంకమోహనరావు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర  కార్యదర్శి సామినేని ఉదయభాను. గుడివాడ ఎమ్మెల్వే కొడాలి నాని, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్ పాల్గొన్నారు. జోగి రమేష్ మాట్లాడుతూ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నియోజకవర్గంలోని పేదలను ఉక్కుపాదంతో తొక్కేస్తున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి పేదప్రజలు గుండెల్లో గుడికట్టుకుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఉమా ఆ పేదలను అణగదొక్కేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్వే పేర్ని నానిలను అరెస్టు చేయటం దారుణమన్నారు.



సంక్షేమ ప్రదాత వైఎస్సార్

ఎమ్మెల్యే కొడాలి మాట్లాడుతూ నాడు వైఎస్సార్ ఆటుపోట్లు ఎదుర్కొని హామీలు ఇవ్వకపోయినా ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీలతో పేదలను ఆదుకున్నారన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి ఉమా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు.  ప్రతిపక్షనేత  జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక లేనిపోని అభాండాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో నిరంకుశ పాలన సాగిస్తూ, ఇసుక మాఫియాకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోందని విమర్శించారు. భవిష్యత్‌లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని కోరారు. ఉదయభాను మాట్లాడుతూ వెంకటచలపతితో గ్రామంలోనే కాక మండల స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. బొమ్మసాని మాట్లాడుతూ 25 ఏళ్లు టీడీపీకి ఎనలేని సేవ చేసినట్లు తెలిపారు. అందుకు బహుమానంగా పేదల పొలాల్లో (గుండెల్లో) విద్యుత్ టవర్లు దించారని ఆవేశంగా మాట్లాడారు. అనంతరం వెంకట చలపతికి పార్టీ కండువావేసి కొడాలి పార్టీలోకి ఆహ్వానించారు.  మండల అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు.

 

జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నాగిరెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు పి.శ్రీనివాసరావు, మురళీరెడ్డి, జక్రి, చలపతిరావు, గ్రామ కన్వీనర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top