న్యాయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతాం


అవసరమైతే రాష్ట్రవాప్తంగా ఉద్యమిస్తాం

 కోరుమిల్లి డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ సీపీ భరోసా

 అధికారపార్టీ ఆగడాలపై మండిపడ్డ జ్యోతుల, బోస్

 పోలీసులు కొట్టరానిచోట కొట్టారని ఆక్రోశించిన బాధితులు

 మండపేట :కోరుమిల్లిలో శనివారం పోలీసులు జరిపిన దౌర్జన్యకాండలో బాధితులైన డ్వాక్రా మహిళలకు న్యాయం జరిగేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ భరోసానిచ్చింది. వారి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు.  నిబంధనల మేరకు ర్యాంపు రాబడిలో పావలా వాటా ఇవ్వాలన్న  ప్రధాన డిమాండ్‌తో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేసి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీఐటీయూ నాయకులతో పాటు 25 మంది మహిళలను అరెస్టు చేసిన ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆదివారం కోరుమిల్లిలో బాధిత మహిళలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ఉద్యమానికి నేతృత్వం వహించిన సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

 

 పోలీసుల దురాగతాన్ని బాధిత మహిళలు వివరించారు. జీఓ ప్రకారం తమ వాటా ఇవ్వమని అడిగినందుకు వృద్ధులు, మహిళలు అని కూడా చూడలేదని, కొట్టరాని చోట కొడుతూ ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారని, అసభ్యపదజాలంతో దూషించారని వాపోయారు. సుంకర వీరబాబు అనే యువకుడిని కాళ్లపై బొబ్బలు వచ్చేలా కొవ్వొత్తులు, సిగరెట్లతో కాల్చిన తీరును వివరించారు. అధికారపార్టీ నేతలకు అండగా పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమాలను స్థానిక ప్రముఖుడు వేగుళ్ల లీలాకృష్ణ వివరించారు. ఖాకీల క్రౌర్యంపై జ్యోతుల తీవ్రంగా స్పందించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోరుమిల్లి డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందుకు జిల్లా పార్టీ నాయకత్వం అంతా తరలివచ్చామన్నారు.

 

 శనివారం ఉన్నతాధికారులతో మాట్లాడి అందరినీ విడుదల చేసేలా కృషి చేశామన్నారు. వారికి నూరుశాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.   చేతకాని వాడిచేతికి దండం ఇచ్చినట్టు ఈ జిల్లాకు చెందిన వ్యక్తికి ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తే మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో నీతిమంతుడిగా స్థానిక ఎమ్మెల్యేపై నమ్మకం ఉండేదని, ఈ ఘటనతో దాన్ని వదులుకున్నానన్నారు. వేధింపు చర్యలతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే డ్వాక్రా మహిళల పక్షాన రాష్ట్రవాప్తంగా ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలిచిన పార్టీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి, నియోజకవర్గ కోఆర్డినేటర్ పట్టాభి, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, స్థానిక నాయకుడు వేగుళ్ల లీలాకృష్ణ, ఉద్యమానికి అండగా నిలిచిన కె.కృష్ణవేణిలను జ్యోతుల అభినందించారు. మహిళలకు న్యాయం జరిగేంత వరకు అండగా పోరాటం చేస్తామన్నారు.

 

 రాష్ర్తమంతటా టీడీపీ నేతల ఇసుక మాఫియూ..

 ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బోస్ మాట్లాడుతూ జీఓలో పేర్కొన్న ప్రకారం పావలా వాటా డ్వాక్రా మహిళలకు ఇవ్వాలన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా అక్రమ వ్యాపారం చేస్తున్నారన్నారు. అక్రమ వ్యాపారంపై సమరానికి కోరుమిల్లి నాంది పలికిందన్నారు. ప్రభుత్వం  కల్పించిన హక్కును అమలు చేయాలని ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కోరుమిల్లి మహిళల పోరాటం ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తుందన్నారు. పట్టాభిరామయ్య చౌదరి మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

 రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, ప్రచారసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. వేగుళ్ల లీలాకృష్ణ నియోజకవర్గంలోని ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలను వివరించారు. సీఐటీయూ నాయకులు డి.శేషుబాబ్జీ, కె.కృష్ణవేణి మాట్లాడుతూ బాధిత మహిళలకు అండగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. ఇసుక మాఫియాగా ఏర్పడి అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమాలు, పోలీసుల దురాగతాలపై స్థానిక డ్వాక్రా మహిళలు, సీఐటీయూ నాయకులు జ్యోతులకు వినతిపత్రం అందజేశారు.

 

 పార్టీ అనపర్తి, ముమ్మిడివరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి, గుత్తుల సాయి, గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు, సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, సత్తి వెంకటరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు, పెట్టా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కొవ్వూరి త్రినాథరెడ్డి, శెట్టిబత్తుల రాజుబాబు, యనమదల గీతా మురళీకృష్ణ, సూరంపూడి సత్యప్రసాద్, వల్లూరి రామకృష్ణ, మేడిశెట్టి సూర్యభాస్కరరావు, శీలం గోవిందు, పిల్లా వీరబాబు, ముమ్మిడివరపు బాపిరాజు, అన్నందేవుల చంద్రరావు, తుపాకుల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top