అసెంబ్లీని కుదిపేసిన ‘ఓటుకు కోట్లు’

అసెంబ్లీని కుదిపేసిన ‘ఓటుకు కోట్లు’ - Sakshi


ఆ వీడియోలను సభలో ప్రదర్శించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై చర్చించాలి

ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ డిమాండ్‌




సాక్షి, అమరావతి: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం అసెంబ్లీని మరోసారి కుదిపేసింది. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తోసిపుచ్చడంతో మొదలైన వివాదం సభ వాయిదాకు దారితీసింది. ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చిన వీడియోలను సభలో ప్రదర్శించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ ప్రారంభమైన ఉదయం 9 గంటల నుంచి 42 నిమిషాల పాటు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై సభలో చర్చించాలని ప్రతిపక్ష సభ్యుడు జి.శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.



స్పీకర్‌ దీన్ని తోసిపుచ్చుతూ ప్రశ్నోత్తరాలను చేపడుతున్నట్టు ప్రకటించారు. తొలి ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందిగా ఆర్థిక మంత్రి యనమలను ఆదేశించారు. యనమల లేచి సమాధానం చెబుతుండగా విపక్ష సభ్యులు సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. ‘ఓటుకు కోట్లు వీడియోను ప్లే చేయాలి, మీకు నైతిక విలువలుంటే తక్షణమే రాజీనామా చేయాలి, రాష్ట్ర పరువు తీసిన ముఖ్యమంత్రి డౌన్‌డౌన్‌’ వంటి నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ గొడవ మధ్యలోనే యనమల తన తొలిప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ దశలో మైకు అందుకున్న టీడీపీ సభ్యుడు కూన రవికుమార్, బొండా ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, యరపతినేని శ్రీనివాసరావు, గొల్లపల్లి సూర్యారావు, ధూళిపాళ్ల నరేంద్ర మొదలు బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు వరకు విపక్షంపై ఆరోపణలు చేశారు. కొందరైతే రాయడానికి వీల్లేని పదాలను సైతం ఉపయోగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top