పోరాటాల్లో పుట్టి పోరాటాల్లో పెరిగిన పార్టీ: విజయమ్మ

ఇడుపులపాయ ప్లీనరీలో ప్రసంగిస్తున్న విజయమ్మ - Sakshi


ఇడుపులపాయ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల్లో పుట్టి పోరాటాల్లో పెరిగిందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. జగన్మోహన రెడ్డి నాయకత్వంలో పోరాడి సమైక్య రాష్ట్రాన్ని నిలుపుకుందామన్నారు. వైఎస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో   ఈ ఉదయం వైఎస్‌ఆర్‌ సీపీ 2వ ప్లీనరీలో ఆమె ప్రారంభోపన్యాసం ఇచ్చారు.



మహానేత  వైఎస్‌ అకాల మరణంతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉన్న సమయంలో తమకు మనోనిబ్బరాన్ని ఇచ్చిన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ పోరాడిన ప్రతి కార్యక్రమానికి అండగా నిలిచిన, ఉపఎన్నికలతోపాటుగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన  నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలకు ఆమె  ధన్యవాదాలు తెలిపారు.



రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో అవిరళ కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ సిపియే అని ఆమె చెప్పారు. వైఎస్‌ కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచిన, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ కృషి చేస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌ను అక్రమంగా జైల్లో నిర్బంధించి, 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను చాలాకాలం రాకుండా చేసినప్పుడు తమ కుటుంబం చాలా ఇబ్బందులు పడిందని వివరించారు. ఈ ఆపద సమయంలో రాష్ట్ర ప్రజలిచ్చిన గుండెనిబ్బరంతోనే ముందుకు నడిచామని చెప్పారు.





రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్‌ఆర్‌ సంక్షేమ పథకాలను కొనసాగించేందుకే పార్టీ  కంకణం కట్టుకుందని చెప్పారు. వ్యవసాయం దండగన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాటలు వైఎస్‌ఆర్‌ హృదయాన్ని కలచివేశాయని తెలిపారు.  రైతన్నల కష్టాలను తీర్చేందుకే వైఎస్ఆర్ తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. ఆయన  పాలనలో రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం 104, 108, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి ఎన్నో పథకాలను వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ అకాల మరణంతో సంక్షేమ పథకాలను  పాలకులు తుంగలోతొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు.



రాష్ట్ర విభజనకు ముఖ్యకారకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,, చంద్రబాబులేనని చెప్పారు. వీరిద్దరూ ఈ రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం అన్నారు. చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతోపాటు ఆయన తెలంగాణకు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలతోనే యూపీఏ ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకుందని  విజయమ్మ చెప్పారు. ఆర్టికల్‌ 3లో సవరణలు చేసి అనవసరంగా రాష్ట్రాలను విభజించవద్దంటూ వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్రంలోని అన్ని పార్టీల జాతీయ నేతలను కలిసినట్లు వివరించారు.  



విభజన బిల్లును అసెంబ్లీ నుంచి తిరిగి కేంద్రానికి పంపడంలో  సీఎం కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనిపిస్తోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వెన్నుపోటుదారులు, పార్టీ ఫిరాయింపుదారుల బెడద పెరిగిందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ను ఏ విధంగానైనా అబాసుపాలు చేయాలని పలువురు ప్రయత్నిస్తున్నారన్నారు. వారి కుట్రలు ఫలించవని చెప్పారు. రాష్ట్ర ప్రజలు జగన్‌వైపే నిలుస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆ విషయం త్వరలోనే వెల్లడి అవుతుందన్నారు.  రాబోయే ఎన్నికల్లో సమైక్యమే వైఎస్ఆర్ సిపి నినాదం అని  విజయమ్మ చెప్పారు.



ఆ తరువాత ఫ్లీనరీకి హాజరైన ప్రతినిధులు పార్టీ  ఎదుగుదలకు కృషి చేస్తామని  ప్రమాణం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top