ఇది ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా?

ఇది ప్రజాస్వామ్యమా..   నియంతృత్వమా? - Sakshi


 కొత్తపేట : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనో లేక నియంతృత్వ పాలన సాగుతుందో అర్ధం కావడం లేదని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. సీఎం చంద్రబాబు వైఖరిపై ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తాను ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా, తన చేతిలో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై జగ్గిరెడ్డి నిరసన తెలిపారు. గురువారం కొత్తపేటలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న వారితో పరిపాలన సాగించాలన్నది రాజ్యాంగ సారాంశమని చెప్పారు. రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.



ప్రజాస్వామ్యానికి అపహాస్యం

నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎమ్మెల్యే అయిన తనకు మంజూరు చేయకుండా, తన చేతిలో ఓడిన వారికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని విమర్శించారు. ఇది ప్రజా తీర్పుకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కాదని, ఓడిన వారికి ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులిస్తే.. అభివృద్ధి జరిగి ఎక్కడ తమకు మంచి పేరు వస్తుందోనని భయపడుతున్నారని చెప్పారు.



నిధులు ఇవ్వనంత మాత్రాన ప్రజా తీర్పు మారదన్నారు. తమను ఇబ్బంది పెడితే, ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలపై ఆందోళనతో పాటు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సభ్యులు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, కనుమూరి శ్రీనివాసరాజు, తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top