నేనున్నా...

నేనున్నా... - Sakshi


బాధితులకు అండగా... కుటుంబాలకు భరోసా    

పేద రైతుల గోడుతో చలించిపోయిన వైఎస్ జగన్  

చంద్రబాబుతో  పోరాడుతానని హామీ

జగన్ సభలకు భారీగా జనసందోహం


 

 చీకటి పాలనతో పోరాడుతున్న వారికి చైతన్య దివిటీ దొరికింది. ఒణుకుతున్న గొంతుతో నినదిస్తున్న గుండెలకు కొంగొత్త బలం వచ్చింది. సత్తువ కోరుతున్న ఉద్యమ వీరులకు సరికొత్త ఆయుధం దొరికింది. వైఎస్‌ఆర్ సీపీ అధినేత రాకతో భోగాపురం వాసుల గళం బలపడింది... నినాదం పదునెక్కింది... జన ఉద్యమం ఊపందుకుంది. సర్కారు అడ్డంకులను దాటుకుంటూ, పోలీసుల ఆంక్షలను ఛేదిస్తూ జన ప్రవాహం జననేత సభకు వచ్చింది. నమ్మించి ఓట్లు వేయించుకుని కాళ్ల కింది నేల లాగేస్తున్న సర్కారుకు వ్యతిరేకంగా జనగళం నినదించింది. తమకోసం వచ్చిన ప్రతిపక్ష నేత వద్ద తమకు జరుగుతున్న అన్యాయంపై జనం మొర పెట్టుకున్నారు. ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు కపట బుద్ధిని చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ తరఫున పోరాడాలని, అండగా నిలవాలని కోరారు.

 

 సాక్షి ప్రతినిధి, విజయనగరం:  రైతుల ఆవేదన, మహిళల రోదన, యువకుల మనోవేదన, వృద్ధుల ఆర్తనాదాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. బాధితులతో మమేకమై వారికి జరుగుతున్న అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. కష్టనష్టాలను విన్నారు. నిరుపేదల కన్నీళ్లు తుడిచారు. అందరి తరఫున పోరాడుతానని, అండగా నిలుస్తానని వారికి భరోసా ఇచ్చారు.

 

 ఎయిర్‌పోర్టు బాధితులకు అండగా నిలిచేందుకొచ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు చంద్రబాబు సర్కారు అనేక అడ్డంకులు సృష్టించింది. అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనొద్దని పోలీసుల చేత బాధిత గ్రామాల్లో హడావుడి చేయించింది. వందలాది మంది పోలీసుల పహరాతో ప్రజల్ని భయకంపితుల్ని చేసింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఊరుదాటి రాకుండా కట్టడి చేసేందుకు  ప్రయత్నించింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆంక్షలు పెట్టించింది. వాహనాలను సైతం తిరగనివ్వకుండా కట్టడి చేసింది. వీడియో, ఫొటోలు తీయించి భయపెట్టింది. ఉద్యమానికి అండగా నిలిచిన నాయకులపైనా పరోక్ష హెచ్చరికలు జారీ చేయించింది.

 

 తమ నాయకుడి పర్యటన కోసం ఏర్పాట్లు చేసిన నాయకుల్ని సైతం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆవేవీ ఎయిర్‌పోర్టు బాధితుల్ని, వైఎస్సార్‌సీపీ నాయకుల్ని ఆపలేకపోయాయి. తమ అండగా నిలిచేందుకొచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జేజేలు కొట్టారు. తమ వద్దకు వచ్చిన వైఎస్ జగన్ ముందు తమ కష్టాలు, ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు, చంద్రబాబు చేస్తున్న మోసాల్ని చెప్పుకొన్నారు.

 

 భోగాపురం మహరాజపేట వద్ద అశేష అభిమాన జన స్వాగతంతో ప్రారంభమైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటన పోలిపల్లి, సవరవిల్లి, ఎ.రావివలస, గూడెపువలస మీదుగా కవుల వాడ వరకు సాగింది. మహరాజపేటలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితర నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ పోలిపల్లి జంక్షన్ వద్ద తొలుత ఎయిర్‌పోర్టు బాధితుల గోడు విన్నారు. ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు, బలవంతపు భూసేకరణ తదితర వాటిపై బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఏ.రావివలసకు చేరుకున్నారు. ఇక్కడ నెల రోజులగా నిరాహార దీక్షలు చేస్తున్న మహిళలకు వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. అధైర్యపడొద్దని, అండగా నిలుస్తానని, ప్రభుత్వంతో పోరాడుతానని, న్యాయపోరాటం కూడా చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఇటీవల మృతి చెందిన రామసూరి కుటుంబీకులను పరామర్శించి, ఓదార్చారు.

 

 గూడెపువలసలో....

 ఆ తర్వాత గూడెపువలస చేరుకుని నిరాహార దీక్షా శిబిరం పక్కనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. దీక్షా శిబిరంలో ఉన్న మహిళల ఆవేదనను, కష్టాలను తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అదే శిబిరంలో పాల్గొన్న ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కృష్ణమూర్తి కుటుంబసభ్యులను పరామర్శించారు.  ఓదార్చి, అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం గూడెపువలసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు తీరును కడిగి పారేశారు. ఎయిర్‌పోర్టు ప్లాన్‌లోకి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్ భూములు రాకుండా చంద్రబాబు చేసిన కుట్రపై మండిపడ్డారు. వేదికపైకి బాధితులను పిలిపించి మాట్లాడించారు. దాదాపు ఏడుగురి చేత చంద్రబాబుకు గడ్డి పెట్టించారు.

 

 కవులవాడలో....

 అక్కడి నుంచి కవులవాడ చేరుకుని అక్కడ బాధితులతో మమేకమయ్యారు. చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. దౌర్జన్యం...మోసం.. చంద్రబాబుకు అలవాటని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఆరుగురు బాధితులను వేదికపై పిలిచి మాట్లాడించారు. మాట్లాడిన ప్రతి ఒక్కరూ మా ఉసురు తప్పకుండా చంద్రబాబుకు తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. ఆయనొక మోసగాడని అభివర్ణించారు. అండగా నిలుస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో బాధితులు ఉపశమనం పొందారు.

 

 ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, కలమట మోహనరావు, విశ్వసరాయి కళావతి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెనుమత్స సాంబశివరాజు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ,  మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్,  బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, జుత్తు జగన్నాయకులు, మీసాల నీలకంఠంనాయుడు,  నియోజకవర్గ సమన్వయకర్తలు బెల్లాన చంద్రశేఖర్,  పెనుమత్స సురేష్‌బాబు, జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, గొర్లె కిరణ్‌కుమార్,  డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమల్ల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయు డు, కె.వి.సూర్యనారాయణరాజు, పార్టీ నేతలు మజ్జిశ్రీనివాసరావు(చిన్న శ్రీను), వరుదు కల్యాణి, అవనాపు విజయ్, సంగిరెడ్డి బంగారునాయుడు, యడ్ల రమణమూర్తి, పిళ్లా విజయకుమార్, కాకర్లపుడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు,మామిడి శ్రీకాంత్, నడిపేన శ్రీను, ఆశపు వేణు, అవనాపు విక్రమ్,మామిడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top