కర్షకుడి కన్నెర్ర

కర్షకుడి కన్నెర్ర - Sakshi


సాక్షి ప్రతినిధి, ఏలూరు : రుణమాఫీ జాప్యం.. కుటుంబంలో ఒక్కరికే మాఫీ.. అది కూడా రూ.లక్షన్నరకే పరిమితం చేయడం.. ఎప్పుడు మాఫీ చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం.. ఫలితంగా బ్యాంకుల నుంచి కొత్త రుణాలు అందక పంటలు వేయలేని దుస్థితిలో జిల్లాలోని అన్నదాతలు గురువారం ఆందోళనబాట పట్టారు. సీఎం  చంద్రబాబు చేసి నమ్మకద్రోహంపై భగ్గుమన్నారు. రైతులు చేపట్టిన ధర్మాగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ప్రతిచోటా నరకాసురవధ పేరిట ఆయన దిష్టిబొమ్మలను దహనం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం జిల్లావ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఎక్కడికక్కడ సీఎం చంద్ర బాబు దిష్టిబొమ్మలను దహనం చేశా రు.

 

 నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, వివిధరూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ఏలూరులోని డీసీసీబీ కార్యాల యం ఎదుట వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులు, పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టి అనంతరం సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. తణుకులో పార్టీ సమన్వయకర్త చీర్ల రాధయ్య నాయకత్వంలో రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దువ్వ సెంటర్లో నరకాసుర వధ పేరిట సీఎం దిష్టిబొమ్మను దహ నం చేసి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలవరంలో పార్టీ జిల్లా శాఖ మాజీ కన్వీనర్ తెల్లం బాల రాజు ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. వందలాదిగా కార్యకర్తలు, రాస్తారోకో చేపట్టి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

 భీమవవరం ప్రకాశం చౌక్‌లో చంద్రబాబు గడ్డిబొమ్మను రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. నల్లజర్ల మండలం దూబచర్లలో చంద్రబాబు దిష్టిబొమ్మను పార్టీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో దహనం చేసి ర్యాలీ చేపట్టారు. చింతలపూడి మండల కేంద్రంలోను,  జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలోను, నరసాపురం అంబేద్కర్ సెంటర్‌లోను, తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడులో నిరసనలు హోరెత్తారుు. అన్నిచోట్లా చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు జరిగారుు. రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

 

 మొత్తం మాఫీ చేయాలి

 రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయూలి. మలకపల్లి సొసైటీలో రూ.20 వేలు, ఆంధ్రాబ్యాంకులో బంగారం తాకట్టుపై రూ.20 వేలు తీసుకున్నాను. రైతుమిత్ర గ్రూపు ద్వారా రూ.3 లక్షలు, మా కోడలి పేరిట సొసైటీలో రూ.40 వేలు సొసైటీలో రుణం తీసుకోవడం జరిగింది. మొత్తం రుణాలన్నీ మాఫీ చేయాలి.

 - కొలిశెట్టి నాగేశ్వరరావు, రైతు, రావూరుపాడు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top